భార్య ఉండగానే రెండో పెళ్లి.. | - | Sakshi
Sakshi News home page

భార్య ఉండగానే రెండో పెళ్లి..

Sep 28 2026 1:29 AM | Updated on Sep 28 2026 1:29 AM

● భర్త ఇంటి ఎదుట మొదటి భార్య ధర్నా

● మొదటి పెళ్లి చేసిన పెద్దలే రెండో పెళ్లికీ సూత్రధారులు

గొల్లపల్లి: ఒకామెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. ఏడడుగులు నడిచి నూరేళ్లు తోడుంటానని బాస చేశాడు. ఆమె తల్లిదండ్రుల నుంచి కట్నకానుకలు తీసుకుని.. కొన్నాళ్ల క్రితం మరో యువతి మోజులో పడ్డాడు. గుట్టుచప్పుడు కాకుండా రెండో పెళ్లి చేసుకుని తమకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించాడు. దీంతో లబోదిబోమన్న మొదటి భార్య భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఈ సంఘటన ఆదివారం మండలకేంద్రంలో వెలుగుచూసింది. బాధితురాలి కథనం ప్రకారం.. గొల్లపల్లి మండలకేంద్రానికి చెందిన ఆవుల రాజయ్య, జమున దంపతులు కుమారుడు శ్రీనివాస్‌ గుంజపడుగు గ్రామానికి చెందిన అనూషను 2022 డిసెంబర్‌ 10న పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. ఆ సమయంలో రూ.10 లక్షలు, 10 తులాల బంగారం కట్నంగా తీసుకున్నాడు. కాపురం సాఫీగా సాగుతున్న వీరి కాపురంలో కొన్నిరోజులుగా కలహాలు మొదలయ్యాయి. శ్రీనివాస్‌ మల్యాల మండలం రామన్నపేటకు చెందిన ఓ యువతితో పరిచయం పెంచుకుని ప్రేమాయణం మొదలుపెట్టి అనూషను అదనంగా మరో రూ.5 లక్షల కట్నం తేవాలంటూ వేధిస్తున్నాడు. భర్త తీరును నిలదీసినందుకు అనూషపై అత్తమామ జమున, రాజయ్య, ఆడబిడ్డలూ వేధింపులకు గురిచేస్తున్నారు. దీంతో మనస్తాపం చెందిన అనూష ఈ ఏడాది జనవరి 25న నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించాగా.. శ్రీనివాస్‌, అతడి కుటుంబ సభ్యులపై 498 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు.

పంచాయితీలో మాట ఇచ్చి.. హైదరాబాద్‌లో రెండో పెళ్లి

కేసు నమోదు కావడంతో దిగొచ్చిన శ్రీనివాస్‌.. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టించాడు. ఇకపై సదరు యువతి జోలికి వెళ్లబోనని, అనూషతోనే ఉంటానని ఒప్పుకున్నాడు. ఇంతలోనే హైదరాబాద్‌లోని తుక్కుగూడ శివాలయంలో సదరు ముస్లిం యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. అనంతరం రక్షణ క ల్పించాలని ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించాడు. ఈ వ్యవహారంలో విస్మయం గొలిపే అంశం ఏంటంటే.. అనూషతో శ్రీనివాస్‌కు తొలి వివాహం జరి పించిన ఇద్దరు పెద్దమనుషులే.. అతడి రెండో పెళ్లిని దగ్గరుండి జరిపించారు. ఈ క్రమంలో తనకు న్యాయం చేయాలంటూ అనూష భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. రెండో పెళ్లి చేసుకున్న యువతి వద్ద తాను బ్యాచిలర్‌నని, ఇంకా పెళ్లి కాలేదని శ్రీనివాస్‌ నమ్మించి మోసం చేసినట్లు తెలిసింది. శ్రీనివాస్‌కు ఇప్పటికే పెళ్లయిందన్న విషయం తెలిసి రెండో యువతి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement