వేములవాడ: భీమేశ్వర ఆలయంలో డిజిటల్ కియోస్క్‌లను ఈవో రమాదేవి బుధవారం ప్రారంభించారు. భీమేశ్వర సదన్ వసతి గృహం సమీపంలో, ఆలయ ప్రాంగణంలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. క్యూలైన్ల తిప్పలు లేకుండా వేగవంతమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో డిజిటల్ కియోస్క్‌లను అందుబాటులోకి తెచ్చినట్లు ఈవో తెలిపారు. ఈ కియోస్క్‌ల ద్వారా లడ్డూ, పులిహోర ప్రసాదాల టికెట్లను, ఇతర పూజా టికెట్లను సులభంగా పొందే వెసులుబాటు కలిగిందన్నారు. డీఈవో నవీన్, పర్యవేక్షకులు శ్రీనివాస్‌శర్మ పాల్గొన్నారు.
రాజన్న ట్రస్టుకు రూ.లక్ష విరాళం
వేములవాడ: రాజన్న ట్రస్టుకు పట్టణానికి చెందిన వ్యాపారి నగుబోతు వీణరఘురాం దంపతులు రూ.లక్ష విరాళంగా అందజేశారు. ఆలయ ఈవో రమాదేవికి బుధవారం అందించారు. ఈ సందర్భంగా దాతలకు స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని అధికారులు అందించారు.
బైక్ దొంగకు రెండేళ్ల జైలు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ద్విచక్ర వాహనం చోరీ కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష పడింది. ఈమేరకు సిరిసిల్ల రెండో అదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి గడ్డం మేఘన బుధవారం తీర్పునిచ్చినట్లు తంగళ్లపల్లి ఎస్సై సిరిసిల్ల అశోక్ తెలిపారు. గతేడాది జూన్ 30న బద్దెనపల్లి శివారులోని పౌల్ట్రీఫామ్ వద్ద జిందం రాజకుమార్‌కు చెందిన బైక్ చోరీకి గురైంది. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, ఇల్లంతకుంటకు చెందిన దుర్మిట్ల నరేశ్‌ను అరెస్ట్ చేశారు. అప్పటి ఎస్సై ఉపేంద్రచారి దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఏపీపీ సందీప్ ప్రాసిక్యూషన్ వాదనలు వినిపించగా కోర్టు మానిటరింగ్ అధికారులు సాక్షులను హాజరుపరిచారు. నేరం రుజువు కావడంతో మేజిస్ట్రేట్ నిందితుడు నరేశ్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించారు.
ఇంట్లో చొరబడి.. చోరీ చేసి..
తిమ్మాపూర్: రామకృష్ణ కాలనీ గ్రామంలో అర్ధరాత్రి దొంగలు కలకలం సృష్టించారు. గ్రామానికి చెందిన కొమ్ము రాధ మంగళవారం తన కూతుర్లతో కలిసి ఇంట్లో పడుకోగా.. అర్ధరాత్రి దాటిన తర్వాత అదే గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు ఇంట్లోకి చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. గమనించిన ఆమె కేకలు వేయడంతో పరారయ్యారు. రెండు బైకులు పట్టుకుని స్థానికులు పోలీసులకు అప్పగించా రు. ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న రూ.50 వేలు ఎత్తుకెళ్లారని మహిళా రోదించింది. ఎస్సై అన్వర్ సిబ్బందితో కలిసి వెళ్లి పరిశీలించారు. ఘటనపై ఫిర్యాదు తీసుకున్నామని, దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.


