పీఐసీ రగడ | - | Sakshi
Sakshi News home page

పీఐసీ రగడ

Sep 24 2026 2:06 AM | Updated on Sep 24 2026 2:06 AM

● ఆదేశాలే లేవు.. కొండూరు బాధ్యతలెలా? ● తీవ్రంగా పరిగణిస్తున్న సహకారశాఖ ● స్తంభించిన కేడీసీసీబీ లావాదేవీలు

కరీంనగర్‌ అర్బన్‌: కేడీసీసీబీ పీఐసీ పోస్టు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. కొండూరు రవీందర్‌రావు ఈ నెల 21న పర్సన్‌ ఇన్‌చార్జీ(పీఐసీ)గా బాధ్యతలు స్వీకరించారు. ఎలాంటి ఉత్తర్వులు లేకుండా బాధ్యతలెలా స్వీకరిస్తారని సహకారశాఖ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనకు తానే బాధ్యతలు చేపట్టడం, పీఐసీగా ప్రకటించుకోవడాన్ని తప్పుబడుతున్నారు. ఈ విషయమై కలెక్టర్‌ చిత్రామిశ్రా అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు డీసీవోను చర్యలకు ఆదేశించినట్లు సమాచారం. కేడీసీసీబీ సీఈవో సత్యనారాయణరావును పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని డీసీవో రామానుజాచార్యులు ఆదేశించగా లిఖితపూర్వక ఆదేశాలు ఇస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని సీఈవో చెబుతున్నారు.

అసలేం జరిగింది?

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయంలో సహకార సంఘాలకు 2020 ఫిబ్రవరి 15న ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి కేడీసీసీబీ చైర్మన్‌గా కొండూరు రవీందర్‌రావు కొనసాగారు. కేడీసీసీబీ పరిధిలో మొత్తం 131 ప్రాథమిక సహకార సంఘాలుండగా కరీంనగర్‌ జిల్లాలో 28, జగిత్యాల 50, పెద్దపల్లి 20, రాజన్న సిరిసిల్ల 23, సిద్దిపేట 4, వరంగల్‌ 2, భూపాలపల్లి జిల్లాలో 4 ప్యాక్స్‌లున్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం రావడంతో ఎన్నికలు నిర్వహించకపోగా పాలకవర్గాల పదవీకాలం 2025 ఫిబ్రవరితో ముగిసింది. ఏడాది గడువు పొడిగించగా, 2025 డిసెంబర్‌ 19న కీలక నిర్ణయం తీసుకుంటూ ప్యాక్స్‌, డీసీసీబీలకు పాలకవర్గాలను రద్దు చేసింది. ప్రభుత్వ అధికారులను పర్సన్‌ ఇన్‌చార్జీలుగా నియమించగా కేడీసీసీబీకి కలెక్టర్‌కు బాధ్యతలు అప్పగించారు. గడువు ముగియకముందే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై పాలకవర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేసింది. మే 12వరకు పర్సన్‌ ఇన్‌చార్జిగా కలెక్టర్‌ కొనసాగగా అప్పటి నుంచి పాలకవర్గం లేదు.

కొండూరు బాధ్యతలపై గరంగరం

2005 నుంచి వరుసగా కేడీసీసీబీ చైర్మన్‌గా ఎన్నికవుతున్న కొండూరు రవీందర్‌రావు 2025 డిసెంబర్‌ 19న జీవో 598 ప్రకారం బాధ్యతల నుంచి తప్పుకున్నారు. హైకోర్టు 598 జీవోను కొట్టివేస్తూ పాత జీవో 386 ప్రకారం పాలకవర్గాలను కొనసాగించాలని ఆదేశాలిచ్చిందని అందుకే బాధ్యతలు చేపట్టానని రవీందర్‌రావు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర సహకారశాఖ నుంచి ఎలాంటి ఆదేశాలు లేవని జిల్లా యంత్రాంగం స్పష్టం చేస్తోంది. ఇదిలా ఉంటే కేడీసీసీబీ పరిధిలో పాత పాలకవర్గాలు తిరిగి బాధ్యతలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

మరోవైపు నామినేటెడ్‌ నియామకాలు

ప్రభుత్వం నామినేటెడ్‌ పద్ధతిలో ప్రాథమిక సహకార సంఘాలకు పాలకవర్గాలను ప్రకటిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 25 సంఘాల వరకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లతో పాటు డైరెక్టర్లను నియమించింది. ఒక్కో సొసైటీకి 13మందితో పాలకవర్గాన్ని ప్రకటించింది. ఈ క్రమంలో కొండూరు రవీందర్‌రావు బాధ్యతలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. అధికార ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీల సిఫారసుల క్రమంలో పాలకవర్గాలను ప్రకటిస్తున్నారు. కాగా కేడీసీసీబీలో మే 12 నుంచి రుణాలు మంజూరు కావడం లేదు. పాలకవర్గాలను నియమిస్తే తప్పా రూ.10లక్షలకు మించి రుణాలు మంజూరయ్యే అవకాశఽం లేదు. వ్యవసాయ, వ్యాపార, విద్య రుణాలు స్తంభించిపోయాయి.

కొండూరుకు చెక్‌

– గంభీరావుపేట ప్యాక్స్‌ చైర్మన్‌గా వేషాల వెంకట్‌

కొండూరు రవీందర్‌రావుకు ప్రభుత్వం చెక్‌ పెట్టింది. నామినేటెడ్‌ పద్ధతిలో సింగిల్‌ విండో చైర్మన్లను ప్రకటిస్తుండగా తాజాగా గంభీరావుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌గా వేషాల వెంకట్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 13మందితో పాలకవర్గాన్ని ప్రకటించగా.. రవీందర్‌రావు ఇక కేడీసీసీబీకి దూరం కానున్నారు. కేడీసీసీబీ చైర్మన్‌ పదవి ఉండాలంటే ప్యాక్స్‌ చైర్మన్‌ పదవి ఉండాల్సిందే. ఇన్నాళ్లు గంభీరావుపేట ప్యాక్స్‌ చైర్మన్‌గా కొండూరు కొనసాగినందునే కేడీసీసీబీలో ఆ హోదా లభించగా.. తాజా ప్రభుత్వ ఉత్తర్వులతో కొండూరుకు చెక్‌ పడినట్లేనని అంతా భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement