జోరువానలో హోరెత్తిన నిమజ్జనం
పూణేబ్యాండ్, ఒగ్గుడోలు మోత
ఆడిపాడిన యువత, మహిళలు
టవర్ వద్ద గణపతులకు ఘన స్వాగతం
మానకొండూర్, కొత్తపల్లి, చింతకుంటలో ప్రశాంతంగా నిమజ్జనం
తెల్లవార్లూ కొనసాగిన కార్యక్రమం
పోలీసుల పటిష్ట బందోబస్తు
కరీంనగర్‌కల్చరల్/కరీంనగర్‌క్రైం/మానకొండూర్/కొత్తపల్లి: మహారాష్ట్ర బ్యాండ్ల హోరు.. డప్పుల దరువు.. ఒగ్గుడోలు విన్యాసాలు.. యువత తీన్మార్ స్టెప్పులు.. మహిళల కోలాటాలు.. ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలతో కరీంనగరం మార్మోగింది. నవరాత్రులపాటు పూజలందుకున్న గణనాథుడికి బుధవారం భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. జోరువానను సైతం లెక్కచేయకుండా భక్తులు శోభాయాత్రలో పాల్గొని గణపతులను నిమజ్జనానికి తరలించారు. పూణే, మహారాష్ట్ర బ్యాండ్ల బృందాల లయబద్ధమైన సంగీతం వేడుకలకు మరింత ఊపునిచ్చింది. యువత ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ అలంకరించిన వాహనాలపై గణనాథులను టవర్‌సర్కిల్‌కు తీసుకొచ్చారు. అక్కడ గణేశ్ ఉత్సవ కమిటీ, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిమజ్జనోత్సవ పూజలు నిర్వహించారు. పాతబజార్‌లోని ఒకటో నంబర్ గణనాథుడికి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, గంగుల కమలాకర్, కలెక్టర్ చిత్రామిశ్రా, సీపీ గౌస్‌ఆలం, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్‌రావు, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శోభాయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి చింతకుంట, కొత్తపల్లి, మానకొండూర్ చెరువుల వైపు నిమజ్జనానికి తరలించారు. వర్షంలో తడుస్తూనే నిమజ్జన కార్యక్రమాలు కొనసాగించారు. మానకొండూర్‌లో అర్ధరాత్రి దాటినా భారీ విగ్రహాలు ఒక్కటి కూడా చెరువుకు చేరలేదు. కొత్తపల్లి చెరువు, చింతకుంట కెనాల్ వద్ద తెల్లవార్లూ నిమజ్జన కార్యక్రమం కొనసాగింది. రాంనగర్‌లోని రెండు భారీ వినాయకుల వద్ద సందడి నెలకొంది. పలు స్వచ్ఛంద సంస్థలు మంచినీరు, ప్రసాదాలు అందించాయి. నిమజ్జనం సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు.


