ఏటీఎం దొంగలు..? | - | Sakshi
Sakshi News home page

ఏటీఎం దొంగలు..?

Sep 21 2026 6:41 AM | Updated on Sep 21 2026 6:41 AM

మహారాష్ట్ర

వైపు

కరీంనగర్‌క్రైం/కరీంనగర్‌రూరల్‌/తిమ్మాపూర్‌: అసలే రాజీవ్‌ రహదారి.. ఎప్పుడూ వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. పోలీస్‌ పెట్రోలింగ్‌, హెచ్‌కేఆర్‌ సంస్థ వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. అయినా దొంగలు ఎలాంటి తనుకుబెణుకు లేకుండా నిమిషాల వ్యవధిలో ఏటీఎంలను గ్యాస్‌ కట్టర్లతో కట్‌ చేసి నగదు ఎత్తుకెళ్లడం విస్మయానికి గురిచేస్తోంది. నిందితులు లేడీ గెటప్‌లో వచ్చి చోరీలకు పాల్పడడం సంచలనం సృష్టించింది.

చోరీల కలకలం

కొద్దిరోజుల క్రితం పీఎంజే జువెల్లరీలో చోరీ.. ఆ తర్వాత భగత్‌నగర్‌లోని ఓ ఇంట్లో భారీ దోపిడీ.. తాజాగా ఏటీఎంల చోరీతో కరీంనగర్‌ మరోసారి వార్తల్లో నిలిచింది. పీఎంజే, భగత్‌నగర్‌ చోరీలను రోజుల వ్యవధిలో చేధించిన పోలీసులు.. ఈ కేసులో అంతే వేగంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. రెండు ఏటీఎంలు రాజీవ్‌ రహదారి వెంట ఉండడం, వేకువజామున జనసంచారం తక్కువగా ఉండడం.. వారు రావడం.. పనిపూర్తి చేసుకుని త్వరగా పరారయ్యేందుకు అవకాశాలను పోలీసులు మ్యాపింగ్‌ చేశారు. నలుగురు వ్యక్తులు (ఒకరు పంజాబీ డ్రెస్‌తో) వచ్చి తిమ్మపూర్‌లో వేకువజామున 3గంటల నుంచి 3.10 గంటల వరకే పనికానిచ్చారు. 3.34గంటలకు దురే్‌శ్‌డ్‌కు చేరుకుని అక్కడ కేవలం 8 నిమిషాల్లో పని పూర్తిచేసుకున్నారు. నిందితులు ఏటీఏంలను నిమిషాల వ్యవధిలోనే బద్దలుకొట్టి సునాయాసంగా పారిపోయారంటే పక్కా ప్రొఫెషనల్స్‌ అని పోలీసులు భావిస్తున్నారు.

స్వల్ప వ్యవధిలో..

తిమ్మాపూర్‌ మండలకేంద్రంలోని ఎస్‌బీఐ ఏటీఎంను ఆదివారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో దొంగలు గ్యాస్‌ కట్టర్లతో కట్‌ చేసి రూ.7,13,400 నగదు దోచుకెళ్లారు. లేడీ గెటప్‌లో ఉన్న ఓ దొంగ ఏటీఎం సెంటర్‌లోకి వెళ్లి సీసీ కెమెరాలపై కెమికల్‌ స్ప్రే చేసి పగులగొట్టాడు. కెమెరాలు పనిచేసినా దోపిడీ దృశ్యాలు నమోదు కాలేదు. ఉదయం గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దుర్శేడ్‌లోని ఏటీఎంలో 3.30 గంటల ప్రాంతంలో చోరీకి పాల్పడ్డారు. గ్యాస్‌కట్టర్‌తో ఏటీఎంను కట్‌ చేసి రూ.8,85,100 నగదు ఎత్తుకెళ్లారు. చోరీ జరిగిన వెంటనే ఢిల్లీ నుంచి పోలీసులకు సమాచారం రావడంతో దుర్శేడ్‌కు రాగా.. అప్పటికే దొంగలు పరారయ్యారు. రెండు ఏటీఎం సెంటర్లను అదనపు డీసీపీ వెంకటరమణ, రూరల్‌ ఏసీపీ విజయ్‌కుమార్‌, సీఐలు నిరంజన్‌రెడ్డి, రమేశ్‌, ఎస్సై అన్వర్‌ సందర్శించారు.

స్కార్పియో చుట్టూ దర్యాప్తు

చోరీలో ఉపయోగించిన స్కార్పియో మహారాష్ట్ర (ఎంహెచ్‌ 03 ఈబీ 4258) రిజిస్ట్రేషన్‌గా నమోదై పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారింది. అయితే ఆ వాహనంపై ఉన్న నంబర్‌ ప్లేట్‌ నకిలీదిగా పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. రేణికుంట, బసంత్‌నగర్‌ టోల్‌గేట్ల వద్ద ఆ వాహనం రికార్డు కాకపోవడం ఆసక్తికరంగా మారింది. టోల్‌గేట్లు ఉన్న ప్రధాన మార్గాలను కావాలనే తప్పించి.. గ్రామీణ రహదారుల మీదుగా జిల్లాలోకి ప్రవేశించి.. తిరిగి ప్రత్యామ్నాయ మార్గాల మ్యాప్‌ను ముందుగానే సిద్ధం చేసుకున్నారా..? అనేది తేలాల్సి ఉంది. మరోవైపు పెద్దపల్లి వైపు వాహనం వెళ్లినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. అక్కడి నుంచి రైలు మార్గంలో ఉత్తరాది వైపు వెళ్లారా..? మంథని మీదుగా ఛత్తీస్‌గఢ్‌ వైపు వెళ్లారా..? లేదా పెద్దపల్లి వరకు అదే వాహనంలో వెళ్లి అక్కడి నుంచి వేరే వాహనంలో తప్పించుకున్నారా తేలాల్సి ఉంది. చోరీలో హర్యానాకు చెందిన అంతర్రాష్ట్ర ముఠా ఉండొచ్చన్న అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సినీఫక్కీలో చోరీలు

ఇటీవల విడుదలైన ద్రిదం, ప్రీతంఅండ్‌పెట్రో వెబ్‌ సీరిస్‌లలో అచ్చం ఇలాగే ఏటీఎం చోరీ దృశ్యాలు ఉండడం గమనార్హం. మే 3న కరీంనగర్‌లోని పీఎంజే జ్యూవెలరీ దోపిడీతో పోల్చితే నేరానికి ముందు రెక్కీ, టార్గెట్‌ ఎంపిక, ఆపరేషన్‌ తక్కువ సమయంలో పూర్తి చేయడం, అనంతరం జిల్లా దాటి పరారయ్యే ప్రయత్నం వంటి అంశాలు కనిపిస్తున్నాయి. టార్గెట్‌లు మారుతున్నా.. నిందితులు ప్రణాళికలో రెక్కీ, భద్రతా లోపాల గుర్తింపు, వేగవంతమైన ఆపరేషన్‌, తప్పించుకునే మార్గం కీలకంగా మారుతున్నాయా..? అనేది చర్చనీయాంశంగా మారింది. ఏటీఎం చోరీలో అంతర్రాష్ట్ర ముఠా ప్రమేయం ఉందన్న అనుమానంతో పోలీస్‌ అధికారులు ఆరు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. రాజీవ్‌ రహదారి వెంట ఉన్న సీసీ కెమెరాలు, టోల్‌గేట్ల పరిసరాలు, పెట్రోల్‌ బంకులు, హైవే జంక్షన్లు.. గ్రామీణ రహదారుల వద్ద ఉన్న కెమెరాలు.. వాహనం కదలికలకు సంబంధించిన సాంకేతిక ఆధారాలు, క్లూస్‌టీంల ద్వారా సేకరించిన ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

వేగంగా ఏటీఎం దోపిడీ ఘటనల దర్యాప్తు

కీలకంగా మారిన నిందితుల స్కార్పియో వాహనం

టోల్‌గేట్లకు చిక్కకుండా గ్రామీణమార్గాల్లో ఎంట్రీ, ఎగ్జిట్‌..?

మంచిర్యాల మీదుగా మహారాష్ట్ర వైపు పరారీపై దర్యాప్తు

తిమ్మాపూర్‌లో రాజీవ్‌ రహదారి పక్కనే ఏటీఎం

రద్దీ ఉన్నా.. దర్జాగా దోపిడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement