● భక్తులు, ఉత్సవ కమిటీలు జాగ్రత్తలు పాటించాలి ● ప్రశాంతంగా వినాయక నిమజ్జనం జరుపుకోవాలి
పెద్దపల్లి: వినాయక నవరాత్రి ఉత్సవాలు జిల్లావ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. నిత్యపూజలు, అన్నదానాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో గణపతి మండపాలు ఆధ్యాత్మికత సంతరించుకున్నాయి. ఇంతటి సందడిగా జరుగుతున్న నవరాత్రి ఉత్సవాలు.. చివరిరోజు.. నిమజ్జనం సందర్భంగా మరింత సంతోషంగా, ఆనందంగా జరుపుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రధానంగా భారీ విగ్రహాల శోభాయాత్ర, చెరువులు, కుంటల్లో నిమజ్జనం సందర్భంగా ఏమాత్రం ఏమరుపాటుగా ఉండొద్దని అంటున్నారు.
అపశ్రుతులకు కారణాలివే..
నిమజ్జనం సందర్భంగా ప్రధానంగా నీటిలోకి దిగడం, లోతు తెలియని ప్రాంతాల్లోకి వెళ్లడం, పిల్లలను పర్యవేక్షణ లేకుండా వదిలేయడం, విగ్రహాలను తరలించే వాహనాలపై నిర్లక్ష్యంగా ప్రయాణించడం, విద్యుత్ తీగల సమీపంలో ఊరేగింపులు నిర్వహించడం వంటి కారణాలతో ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది. ఇటీవల సంగారెడ్డి జిల్లాలో వినాయక నిమజ్జనం సందర్భంగా ఆరుగురు విద్యార్థులు నీటమునిగి మృతి చెందిన ఘటన విషాదాన్ని మిగిల్చింది.
నీటిలోకి దిగొద్దు..
గణేశ్ నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో నిర్ణయించిన ప్రదేశాల్లోనే నిమజ్జనం చేయాలి. చెరువులు, కుంటలు, వాగుల్లో లోతు తెలియని ప్రాంతాల్లోకి దిగకూడదు. ముఖ్యంగా పిల్లలు, ఈత రానివారు నీటి వద్దకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలి. నిమజ్జనం పేరుతో నీటిలోకి వెళ్లి ఫొటోలు, వీడియోలు తీసుకోవడం వంటి వాటికి దూరంగా ఉండాలి.
విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తం
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మండపాలు, ఊరేగింపు మార్గాల్లో విద్యుత్ భద్రతపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. విద్యుత్ తీగలకు విగ్రహాలు, అలంకరణలు తగలకుండా ముందుగానే మార్గాన్ని పరిశీలించాలి. అనధికార విద్యుత్ కనెక్షన్లకు దూరంగా ఉండాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. పోలీసులు కూడా గణేశ్ ఉత్సవాల సందర్భంగా విద్యుత్ భద్రత, ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.
నిబంధనలు పాటించాలి
నిమజ్జన శోభాయాత్రలో నిర్ణయించిన మార్గం, సమయాలను పాటించాలి. వాహనాలపై అధిక సంఖ్యలో భక్తులు ఎక్కకుండా చూడాలి. విగ్రహాల తరలింపునకు ఉపయోగించే వాహనాలు, క్రేన్లు సురక్షితంగా ఉండేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలి. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగకుండా పోలీసుల సూచనలను పాటించాలి. భారీవిగ్రహాల తరలింపులో ఓవర్‌హెడ్ విద్యుత్ తీగలు, రహదారి వెడల్పు, వంతెనల సామర్థ్యం వంటి అంశాలను అధికారులు ముందుగానే పరిశీలిస్తున్నారు.
నిమజ్జన ప్రాంతాల్లో..
పోలీసుల సూచనల మేరకు మాత్రమే నిమజ్జనం చేయాలి.
నీటిలోకి దిగకుండా నిర్ణయించిన ప్రదేశం నుంచే నిమజ్జనం చేయాలి.
రద్దీ ప్రాంతాల్లో తోపులాట జరగకుండా క్యూలైన్లను పాటించాలి.
వాహనాలను నిర్దేశిత ప్రదేశాల్లోనే నిలిపివేయాలి.
అత్యవసర పరిస్థితుల్లో పోలీసు, వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వాలి.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడకూడదు.
గజఈతగాళ్లను అందుబాటులో ఉంచాలి
పకడ్బందీగా ఏర్పాట్లు
వినాయక విగ్రహాల నిమజ్జన ప్రాంతాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, గ్రామపంచాయతీ, వైద్య, ఆరోగ్యశాఖలు సమన్వయంతో పనిచేస్తున్నారు. భక్తులు, ఉత్సవ కమిటీలు సహకరించాలి.
– కోయ శ్రీహర్ష, కలెక్టర్
రూట్‌మ్యాప్ ప్రకారమే నిమజ్జనం
పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని, గోదావరిఖని లాంటి ప్రధాన ప్రాంతాల్లో పోలీసుల రూట్‌మ్యాప్ ప్రకారమే విగ్రహాలు నిమజ్జనం చేయాలి. నిమజ్జనం సందర్భంగా ఎవరూ మద్యం తాగొద్దు. అల్లరి మూకలపై పోలీసుల నిఘా ఉంటుంది.
– రాంరెడ్డి, డీసీపీ, పెద్దపల్లి
భక్తి శ్రద్ధలతో వేడుక..


