● అభ్యసన సామర్థ్యాన్ని పెంచేందుకు వర్క్‌బుక్స్
● తొలిసారి ఈ ఏడాది నుంచి ప్రవేశం
గంభీరావుపేట(సిరిసిల్ల): విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యం పెంపొందించడంతోపాటు పాఠ్యాంశాలపై పట్టు సాధించేలా ప్రత్యేక సాధన పుస్తకాలు(వర్క్‌బుక్స్) రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ద్వారా తొలిసారిగా వర్క్‌బుక్స్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలోని హైస్కూల్, మోడల్, కేజీబీవీలు కలిపి 131 పాఠశాలల్లో చదువుతున్న 22,471 మంది విద్యార్థులకు వర్క్ బుక్స్ పంపిణీ చేశారు. మొదటి విడతగా నాన్ లాంగ్వేజెస్ వర్క్‌బుక్స్ అందించారు. లాంగ్వేజెస్ వర్క్‌బుక్స్ రావాల్సి ఉంది. పాఠ్యాంశం బోధన పూర్తయిన తర్వాత వర్క్‌బుక్స్‌లో సాధన చేయించనున్నారు. బోధన సమయంలో 15 నుంచి 20 నిమిషాలు వర్క్‌షీట్ సాధనకు కేటాయించనున్నారు
సంసిద్ధతకు తొలి పది
మొదటి 10 సంసిద్ధత వర్క్‌షీట్స్ తరగతుల్లో విద్యార్థులు నేర్చుకున్న భావనల ఆధారంగా రూపొందించారు. విద్యార్థుల పూర్వ జ్ఞానాన్ని గుర్తించి, ప్రస్తుత తరగతి అభ్యసనానికి అవసరమైన పునాదిని బలోపేతం చేయనున్నారు. పాఠం పుర్తయితే ప్రతీ పాఠం చివర ప్రత్యేకంగా పునశ్చరణ వర్క్‌షీట్ అందించారు. పాఠం మొత్తం పూర్తయిన అనంతరం ఒక పీరియడ్‌లో విద్యార్థులతో దీనిని పూర్తి చేయించనున్నారు.
స్వతంత్ర సాధన.. ఉపాధ్యాయుల మార్గదర్శనం
విద్యార్థులు వర్క్‌షీట్స్ సాధ్యమైనంత వరకు స్వతంత్రంగా పూర్తిచేయాలి. అభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, సహకారం అందించాల్సి ఉంది. వర్క్‌షీట్స్ పూర్తయిన తర్వాత వాటిని ఉపాధ్యాయులు పరిశీలించి, తప్పులను సరిదిద్ది సంతకం చేయనున్నారు. చాలా మంది విద్యార్థుల్లో కనిపించే సాధారణ తప్పులను గుర్తించి తరగతి స్థాయిలో చర్చించనున్నారు. ఆయా తప్పులకు కారణాలను వివరించి, విద్యార్థులు వాటిని అధిగమించేలా స్పష్టత కల్పించనున్నారు.
విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యం పెంపునలకు దోహదపడేలా విద్యాశాఖ ఈ ఏడాది నుంచి వర్క్‌బుక్స్ ఇవ్వడం జరిగింది. జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేశాం. వర్క్‌బుక్స్ నిర్వహణ గురించి సంబంధిత సబ్జెక్టు టీచర్లు అవగాహన కల్పిస్తున్నారు.
– శ్రీరాం మొండయ్య, డీఈవో, రాజన్న సిరిసిల్ల


