నాలుగో రైల్వేట్రాక్‌ ఏర్పాటుకు కసరత్తు | - | Sakshi
Sakshi News home page

నాలుగో రైల్వేట్రాక్‌ ఏర్పాటుకు కసరత్తు

Sep 21 2026 6:41 AM | Updated on Sep 21 2026 6:41 AM

రామగుండం: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కాజీపేట–బల్హర్షా మధ్య నాలుగో రైల్వేలైన్‌ ఏర్పాటుకు రైల్వే మంత్రిత్వశాఖ పచ్చజెండా ఊపింది. ఇందుకోసం 250 కి.మీ. మేర డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్ట్‌(డీపీఆర్‌), ఫైనల్‌ లొకేషన్‌ సర్వే (ఎఫ్‌ఎల్‌ఎస్‌) ప్రక్రియను ఇప్పటికే పూర్తిచేసింది. మొత్తం రైల్వేట్రాక్‌లో 80శాతం తెలంగాణ, 20శాతం మహారాష్ట్ర పరిధిలోకి ఉంటుంది. ట్రాక్‌ నిర్మాణ అంచనా వ్యయం రూ.3,500 కోట్లు అని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది.

మూడోలైన్‌ పూర్తయిన వందరోజుల్లోనే..

గ్రాండ్‌ ట్రంక్‌ రూట్‌లోని మూడో ట్రాక్‌ పూర్తిచేసిన వందరోజుల్లోనే నాలుగో లైన్‌కు ఉన్నతాధికారులు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ప్రస్తుట్రాక్‌కు ఇరువైపులా రైల్వేస్థలాలను గుర్తించి చదును చేసి ఎస్‌సీఆర్‌ పేరిట ఎరుపురంగు హద్దు రాళ్లు వేస్తున్నారు. కొన్నిచోట్ల పంటలు సాగుచేస్తున్న రైతులను ఖాళీ చేయాలని ఆదేశాలు జారీచేస్తున్నారు.

ప్రత్యేకాధికారుల నియామకం

కాజీపేట–బల్హర్షా మధ్య నాలుగో రైల్వేలైన్‌ నిర్మాణానికి రైల్వే మంత్రిత్వశాఖ ప్రత్యేకాధికారులను నియమిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. మంచిర్యాల జిల్లాలోని తాండూర్‌, బెల్లంపల్లి మండలాల పరిధిలోకి వచ్చే రైల్వేలైన్‌కు బెల్లంపల్లి సబ్‌ కలెక్టర్‌, మందమర్రి, మంచిర్యాల మండలాలకు మంచిర్యాల ఆర్డీవో, అంతర్గాం, రామగుండం, పెద్దపల్లి, ఓదెల, పాలకుర్తి మండలాల పరిధిలో వచ్చే రైల్వేలైన్‌ పర్యవేక్షణకు పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య, జమ్మికుంట, హుజూరాబాద్‌ పరిధిలో హుజూరాబాద్‌ ఆర్డీవోను పర్యవేక్షణాధికారులను నియమించింది. వీరు ఎగ్జిక్యూషన్‌, మెయింటెనెన్స్‌, మేనేజ్‌మెంట్‌, ఆపరేషన్‌ తదితర అంశాల బాధ్యతలు కలిగి ఉంటారని పేర్కొంది.

అధిక ఆదాయం వచ్చే అవకాశం..

నాలుగో రైల్వేలైన్‌ వినియోగంలోకి వస్తే వస్తు, సామగ్రి రవాణా, ప్రయాణికుల రాకపోకలు మరింత పెరుగుతాయి. రైళ్లవేగం గరిష్టంగా గంటకు 130 కి.మీ.కు చేరుకుంటుంది. గూడ్సురైళ్ల ద్వారా బొగ్గు, సిమెంట్‌, గ్రానైట్‌, ముడిసరుకులు ఇతరత్రా ఎగుమతుల్లో వేగం పుంజుకుంటుంది. ఇది పరిశ్రమలకు ఊరటనిచ్చే అంశమని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. తద్వారా దక్షిణ మధ్య రైల్వే జోన్‌కు రూ.వేల కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు.

పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement