కరీంనగర్‌రూరల్: కరీంనగర్ మండలం మొగ్ధుంపూర్‌లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దాడి శారద(50) అనే మహిళ మృతిచెందినట్లు సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఉదయం 11.20 గంటలకు కూకట్ల కనకమ్మ అనే మహిళ కరీంనగర్ వెళ్లేందుకు ఆటో కోసం ఎదురుచూస్తుండగా.. సమీపంలో ఉన్న శారదతో మాట్లాడుతున్న క్రమంలో గోదావరిఖని నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు ఎగిరి కింద పడగా.. కారు ఆపకుండా వెళ్లిపోయింది. స్థానికులు చికిత్స నిమిత్తం ఇద్దరిని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శారద మరణించింది. కనకమ్మకు కాళ్లు, చేతులు విరగగా.. చికిత్స పొందుతోంది. మృతురాలికి భర్త ఓదెలు, ఇద్దరు కుమార్తెలు, కుమారుడున్నారు. కుమారుడు ఉదయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


