‘పుష్కర’ పనులకు శ్రీకారం | - | Sakshi
Sakshi News home page

‘పుష్కర’ పనులకు శ్రీకారం

Sep 20 2026 1:39 AM | Updated on Sep 20 2026 1:39 AM

2027లో గోదావరి పుష్కరాలు

జూన్‌ 26 నుంచి జూలై 7 వరకు..

ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం

ధర్మపురి: గోదావరికి పుష్కరాల సమయం ఆసన్నమవుతోంది. మరో 8 నెలల్లో నిర్వహించే పుష్కరాల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. గతంలో ఏర్పాటు చేసిన పుష్కరఘాట్లను పునరుద్ధరించి భక్తులు నడవడానికి సరికొత్త రూపంలో ఏర్పాట్లు చేస్తున్నారు. దక్షిణకాశిగా ప్రసిద్ధి చెందిన ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి పుణ్యక్షేత్రంతోపాటు శాతవానుల తొలి రాజధాని కోటిలింగాల ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది. తీర్థంగా, క్షేత్రంగా విరాజిల్లుతున్న లక్ష్మినృసింహుడి క్షేత్రంలో గోదావరి పుష్కరాలను 12 రోజులపాటు నిర్వహించడానికి పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్కరాల సందర్భంగా వచ్చే లక్షలాది మంది భక్తులకు సకల సౌకర్యాలు కల్పించడం కోసం అధికారులు ప్రణాళిక సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ప్రత్యేక చొరవతో కోట్లాది నిధులు విడుదలయ్యాయి. ధర్మపురి నియోజకవర్గంలోని కోటిలింగాల, రాయపట్నం, తిమ్మాపూర్‌, ఆరెపెల్లి, దొంతాపూర్‌, మగ్గిడి, ఎడపెల్లి, రాజారం, దమ్మన్నపేట తదితర గోదావరి తీర ప్రాంతాల్లో పనులు చేపట్టనున్నారు.

పుష్కరాల కోసం రూ.132 కోట్లు

గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం రూ.132 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ.110 కోట్లకు అనుమతి లభించింది. ఘాట్ల అభివృద్దికి మరో రూ.22.16కోట్లకు అనుమతి వచ్చింది. టెండర్ల ప్రక్రియ పూర్తయ్యాక పనులు అధికారికంగా ప్రారంభించనున్నారు.

ఘాట్ల విస్తరణ పనులు

గతంలో నిర్మించిన పుష్కరఘాట్లు నడవడానికి వీలు లేకుండా ఉండడంతో వాటిని పునరుద్ధరించి భక్తులకు అనుకూలంగా మార్చనున్నారు.

గోదావరిలోని మంగలిగడ్డ ఘాట్‌ 102 మీటర్లు. వాటిలో మెట్ల విస్తరణ, స్టాంప్ట్‌ కాంక్రీట్‌ క్లాడింగ్‌, నవహారతి వేదికలు, నవనారసింహస్వామి విగ్రహాలు ఏర్పాటు చేయనున్నారు.

హరిత ఘాట్‌ 247 మీటర్లు ఉండగా.. వాటిలో విస్తరణ, అభివృద్ధి చేపట్టనున్నారు.

మహాలక్ష్మిఘాట్‌ 70 మీటర్లు ఉండగా మెట్ల విస్తరణ, అభివృద్ధి చేయనున్నారు.

మహిళా భక్తులు దుస్తులు మార్చుకునేందుకు వీలుగా 20 గదులు నిర్మించనున్నారు. ప్రతి యూనిట్‌లో 5 ప్రత్యేక గదులు ఉండేలా చూస్తారు.

నూతనంగా 129 మీటర్ల స్నానఘాట్లు నిర్మించనున్నారు. హరిత ఘాట్‌ నుంచి మహాలక్ష్మి ఘాట్‌ వరకు 85 మీటర్లు విస్తరించనున్నారు. హరిత నుంచి మంగలిగడ్డ ఘాట్‌ వరకు 11 మీటర్లు, మంగలిగడ్డ ఘాట్‌ నుంచి వీఐపీ, సంతోషిమాత ఘాట్‌ వరకు 33 మీటర్లు ఉంటుంది. ఇందులో దివ్యాంగులు, వీల్‌చైర్‌ వినియోగదారులకు ర్యాంప్‌లు నిర్మించనున్నారు.

భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం

గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. ప్రభుత్వం నుంచి విడుదలైన నిధులతో ధర్మపురిని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతాం. అభివృద్ధి పనులకు ఎంత ఖర్చైనా వెనుకాడేది లేదు.

– అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, మంత్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement