ప్రయాణికుల భద్రత | - | Sakshi
Sakshi News home page

ప్రయాణికుల భద్రత

Sep 20 2026 1:39 AM | Updated on Sep 20 2026 1:39 AM

ఆస్తుల పరిరక్షణ..
నిరంతరం శ్రమిస్తున్న ఆర్‌పీఎఫ్‌ జవాన్లు ● నేడు ఆర్‌పీఎఫ్‌ ఆవిర్భావ వేడుకలు

రామగుండం: రైల్వే ఆస్తుల పరిరక్షణ, ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌పీఎఫ్‌) జవాన్లు నిత్యం శ్రమిస్తున్నారు. 1985 సెప్టెంబర్‌ 20న పార్లమెంట్‌లో చట్ట సవరణ ద్వారా కేంద్ర సాయుధ బలగాల హోదా కల్పించడంతో జాతీయ భద్రతాదళంగా ఆవిర్భవించింది. దీంతో ఏటా సెప్టెంబర్‌ 20న ఆర్‌పీఎఫ్‌ రైజింగ్‌ డే నిర్వహించుకుంటారు.

ప్రయాణికుల భద్రత, ఆస్తుల రక్షణ: ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతి అందించడం ఆర్‌ఫీఎఫ్‌ లక్ష్యం. రైల్వే సంపద, వసతులు, కార్గో చోరీ నివారణ, రైల్వేస్టేషన్లు, లైన్లను పర్యవేక్షిస్తూ నేరాలను అరికట్టడం వీరి విధి.

ఆపరేషన్లు నిర్వర్తించడం: రైల్వేస్టేషన్లలో తప్పిపోయిన, అపహరణకు గురైన, ఇళ్లనుంచి పారిపోయిన వారిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించడాన్ని ‘ఆపరేషన్‌ నన్హే ఫరిస్తే’గా పేర్కొంటారు. కదులుతున్న రైలు ఎక్కే, దిగే క్రమంలో పడిపోయే ప్రయాణికులను గుర్తించి ప్రాణాలకు తెగించి కాపాడుకోడవం ‘ఆపరేషన్‌ జీవన్‌ రక్ష’గా పేర్కొంటారు. ప్రయాణికులు రైళ్లలో మరిచిపోయిన విలువైన లగేజీలను గుర్తించి తిరిగి వారికి అప్పగించడం ‘ఆపరేషన్‌ అమానత్‌’గా పేర్కొంటారు. డ్రగ్స్‌, గంజాయి మాదక ద్రవ్యాల రవాణాను అరికట్టడమే ‘ఆపరేషన్‌ నార్కోస్‌’గా పేర్కొంటారు. ఒంటరిగా ప్రయాణించే మహిళా ప్రయాణికులు వారు గమ్యస్థానం చేరే వరకు భద్రత, ధైర్యం అందించడమే ‘మేరీ సహేళి’ పథకంగా అభివర్ణిస్తారు. రైల్వేలో మహిళా ప్రయాణికుల రక్షణ నిమిత్తం ప్రత్యేక స్క్వాడ్‌లు నిరంతరం గస్తీ తిరుగుతుంటాయి.

ఆధునిక సాంకేతిక సవాళ్లతో విధుల నిర్వహణ: రైల్వేస్టేషన్లలో నేరాలను అరికట్టడం, అత్యాధునిక ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టమ్స్‌తో నిందితులను గుర్తించడం, ఈ–టికెటింగ్‌ బ్లాక్‌ మార్కెటింగ్‌ ముఠాలపై నిఘా చేయడానికి ‘ఆపరేషన్‌ ఉపలబ్ద్‌’ ద్వారా అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ల వినియోగం. వీటితో పాటు విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కమాండో తరహా శిక్షణ, డాగ్‌ స్క్వాడ్‌ ఆధునిక ఆయుధాల వినియోగంపై ఆర్‌పీఎఫ్‌కు నిరంతరం ప్రత్యేక తర్ఫీదు ఇవ్వడం.

అవగాహన కోసం

ఏటా సెప్టెంబర్‌ 20న ఆర్‌పీఎఫ్‌ ఆవిర్భావ వేడుకలను జరుపుకోవడం అంటే మరోసారి మా విధులను గుర్తు చేసుకోవడంమే. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకుంటూ రైల్వే ఆస్తుల పరిరక్షణ, నిఘా విభాగాల సమాచారంతో చోరీలు, నిషేధిత వస్తువుల రవాణాపై ఉక్కుపాదం మోపడం మా నిరంతరం ప్రక్రియ.

– నవీన్‌కుమార్‌, సికింద్రాబాద్‌ డివిజనల్‌ సీనియర్‌ సెక్యూరిటీ కమిషనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement