● పాత పంచాయతీ భవనం కూల్చివేత
● అడ్డుకునేందుకు యత్నించిన పంచాయతీ పాలకవర్గం
తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లిలో శనివారం తెల్లవారుజామున గ్రామపంచాయతీ పాత భవనం కూల్చివేత ఉద్రిక్తతకు దారితీసింది. ఈ భవనాన్ని ఏ మహిళా సంఘానికి ఇవ్వాలనే విషయంపై కొన్ని రోజులుగా అధికార, ప్రతిపక్ష పార్టీల మహిళా సంఘాల మధ్య వివాదం కొనసాగుతోంది. ఈక్రమంలోనే శనివారం అర్ధరాత్రి తర్వాత అధికారులు పోలీసుల అండదండలతో గ్రామంలోకి వచ్చి ఆ భవనాన్ని కూల్చివేయించారు. మన్నెంపల్లి గ్రామపంచాయతీ పాత భవనం కూల్చివేత హైడ్రామాను తలపించింది. కొన్ని రోజులుగా అధికార పార్టీకి చెందిన మహిళా సంఘాల సభ్యులు, పంచాయతీ పాలకవర్గం మధ్య ఈ భవనం విషయంలో వివాదం కొనసాగుతోంది. శనివారం తెల్లవారుజామున పోలీస్ బలగాలతో గ్రామంలోకి వచ్చిన అధికారులను పంచాయతీ పాలకవర్గం సభ్యులు అడ్డుకున్నారు. అయినా బలవంతంగా జేసీబీతో భవనాన్ని కూల్చివేశారు. అడ్డుకునే యత్నం చేసిన సర్పంచ్ భర్త పొన్నం అనిల్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎల్‌ఎండీ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ట్రైనీ కలెక్టర్ పాత పంచాయతీ భవనం బాగుందని చెప్పినా కలెక్టర్‌కు తప్పుడు రిపోర్టులు ఇచ్చి కూల్చివేత ఆర్డర్ తెచ్చారని గ్రామ సర్పంచ్ పొన్నం సునీత ఆరోపించారు. అధికార పార్టీ నేతలు పంచాయతీ సెక్రెటరీని బెదిరించి.. పోలీస్ ప్రొటెక్షన్ కావాలని రాత్రికి రాత్రే నోటీసులు తెచ్చుకున్నారన్నారు. పాలకవర్గానికి నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలతో ఎన్నుకోబడిన తన ఆత్మగౌరవాన్ని పోలీసులు, అధికారులు దెబ్బతీశారంటూ సర్పంచ్ కన్నీరు పెట్టుకున్నారు. దళితుడైన ఉపసర్పంచ్‌పై పోలీసులు చేయిచేసుకున్నారని ఆరోపించారు. గ్రామపంచాయతీని కూల్చేందుకు వచ్చిన సీఐ బొల్లం రమేశ్ భవనాన్ని కూల్చొద్దని అడ్డుకున్న గ్రామస్తులపై, సర్పంచ్ భర్తపై దురుసుగా ప్రవర్తించారని గ్రామస్తులు ఆరోపించారు. సీఐ తీరుపై సీపీకి ఫిర్యాదు చేస్తామని సర్పంచ్ సునిత తెలిపారు. పాత పంచాయతీ భవనంలో విలువైన రికార్డులు ఉన్నాయని, భవనాన్ని బుల్డోజర్‌తో కూల్చివేయడంతో అవి అందులోనే ధ్వంసమయ్యాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు.
కూల్చివేస్తామని చెప్పినా వినలేదు
పాతపంచాయతీ భవనం కూల్చేందుకు కలెక్టర్ ఆర్డర్ ఉందని పోలీసులు గ్రామానికి వచ్చారు. రెండు రోజుల్లో భవనం మేమే కూల్చివేస్తామని చెప్పినం. అందులో విలువైన సామగ్రి ఉందన్నా పోలీసులు వినిపించుకోలేదు. ఎమ్మెల్యే కవ్వంపల్లి ఒత్తిడితో పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారు.
– సునీత, సర్పంచ్, మన్నెంపల్లి


