● భర్త మృతి తట్టుకోలేక ఆత్మహత్య
● అనాథలైన ఇద్దరు చిన్నారులు
● కంటతడి పెట్టించిన ఘటన
జూలపల్లి: భార్య, భర్త, ఇద్దరు పిల్లలు.. చిన్న కుటుంబం.. చింతలేని కుటుంబం.. కూలీనాలీ చేసుకుని బతుకుతున్న సామాన్య కుటుంబం.. కానీ, అనారోగ్యం ఆ కుటుంబ పెద్దను కబళించింది. ఉన్నంతకాలం ప్రేమ, ఆప్యాయత పంచిన పెనిమిటి ఒక్కసారిగా దూరం కావడంతో భార్య తట్టుకోలేకపోయింది. ఆయనలేని బతుకు తనకెందుకని అనుకుందో ఏమో.. కనీసం తన ఇద్దరు చిన్నారుల భవిష్యత్‌ను కూడా పట్టించుకోలేదు. చావైనా, బతుకై నా భర్తతోనే అని భావించి తనూ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కాచాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. మృతురాలి బంధువులు, ఎస్‌ఐ మల్లేశ్ కథనం ప్రకారం.. కాచాపూర్ గ్రామానికి చెందిన దర్శనాల సతీశ్‌కు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం బాలయ్యపల్లెకు చెందిన వసంతతో గతంలో వివాహం అయ్యింది. వీరికి ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. తీవ్ర అనారోగ్యానికి గురైన సతీశ్ చికిత్స పొందుతూ 36రోజుల క్రితం చనిపోయాడు. దీంతో వసంత తీవ్రంగా కుంగిపోయింది. అప్పట్నుంచి ముదావహంగా ఉంటోంది. భర్తలేని బతుకెందుకని మదనపడుతూ వస్తోంది. ఈక్రమంలోనే శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేనిసమయంలో ఉరి వేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పెద్దపల్లి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.
అనాథలైన ఇద్దరు చిన్నారులు..
తండ్రి సతీశ్, తల్లి వసంత కానరాని లోకాలకు వెళ్లడంతో వారి ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. ఎంతో భవిష్యత్ ఉన్న చిన్నారులు, తల్లిదండ్రుల చేతుల్లో ఎదగాల్సిన జీవితాలు అనాథలుగా మారడం గ్రామస్తుల్ని కలచివేసింది. మృతిరాలి తల్లి గోదరి అంజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు.


