కరీంనగర్‌టౌన్: రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలని తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ సభ్యుడు, మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి అన్నారు. తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నిర్వహిస్తున్న విద్యా బస్‌యాత్రలో భాగంగా శుక్రవారం కరీంనగర్ ఫిల్మ్‌భవన్‌లో విద్యావంతులు, మేధావులు, సామాజిక కర్తలతో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో మాట్లాడారు. వేగంగా పెరుగుతున్న ప్రైవేట్ విద్య ఖర్చులను నియంత్రించాలన్నారు. ఒకట్రెండు ప్రతిష్టాత్మక పాఠశాల ప్రాజెక్టులు చేపట్టడం వల్ల పాఠశాల విద్య ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని అధిగమించలేమని, ప్రతీ చిన్నారికి నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చేలా చేయలేమన్నారు. మరో మాజీ అధికారి ఎం.చంపాలాల్ మాట్లాడుతూ, తెలంగాణలో ప్రస్తుతం ఎదుర్కొంటున్న మూడు ప్రధాన సంక్షోభ రంగాలు విద్య, వైద్యం, సేద్యం అని అన్నారు. విద్యా కార్యకర్త డా.ధర్మేంద్ర నదిమెంట్ల మాట్లాడుతూ, ఉపాధ్యాయ సంఘాలు తమ హక్కులు, సంక్షేమం కోసం పోరాడుతూనే విద్యా వ్యవస్థలో సానుకూల మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక కార్యకర్త చంద్రప్రభాకర్ మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యాసంస్థలకు చెందిన విలువైన భూములను పరిరక్షించాల్సిన ప్రాధాన్యతను వివరించారు. ముప్పూరి కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉపాధ్యాయ సంఘం నాయకుడు సుంకసేన ప్రభాకర్‌రావు , కోర్ కమిటీ సభ్యులు నిఖిల్, విజయకృష్ణ, ప్రొఫెసర్ పద్మజా, ఎన్.రుబీనా తదితరులు పాల్గొన్నారు.


