● 2 కిలోల గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్
కరీంనగర్‌క్రైం: నాగ్‌పూర్ నుంచి గంజాయి కొనుగోలు చేసి కరీంనగర్‌లో విక్రయించేందుకు ప్రయత్నించిన ఇద్దరిని కరీంనగర్ త్రీ టౌన్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. త్రీ టౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. కరీంనగర్ హౌసింగ్‌బోర్డుకాలనీ వరాహస్వామి ఆలయ సమీపంలో గురువారం అనుమానాస్పదంగా సంచరిస్తున్న హౌసింగ్‌బోర్డుకాలనీకి చెందిన సయ్యద్ ముబీన్, అజ్మత్‌పురకు చెందిన మొహమ్మద్ యూనస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని తనిఖీ చేయగా సుమారు 2 కిలోల గంజాయి, మొబైల్ ఫోన్లు లభించాయి. కొంత మొత్తాన్ని తమ అవసరాలకు వినియోగించడంతో పాటు, మిగిలిన గంజాయిని కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో విక్రయించేందుకు తీసుకొచ్చినట్లు విచారణలో వెల్లడైంది. ఈ ఘటనపై త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. టౌన్ ఏసీపీ వెంకటస్వామి, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ సతీశ్, త్రీటౌన్ ఇన్‌స్పెక్టర్ తిరుమల్, ఎస్సై చేరాలు, శ్రీకాంత్, సురేందర్, సిబ్బందిని సీపీ గౌస్ ఆలం అభినందించారు.


