కరీంనగర్‌స్పోర్ట్స్: కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియం గురువారం సరికొత్త ఉత్సాహాన్ని సంతరించుకుంది. జిల్లా పాఠశాలల క్రీడాసమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్–14 బాలికల కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. గెలుపే లక్ష్యంగా మైదానంలోకి దిగిన బాలికలు ముందస్తుగా ఎక్సర్‌సైజ్‌లు చేస్తూ మ్యాచ్‌కు సిద్ధమయ్యారు. మ్యాచ్ ప్రారంభానికి ముందే పీఈటీలు, పీడీలు క్రీడాకారిణులకు విలువైన సూచనలిస్తూ.. వ్యూహాలను వివరిస్తూ కనిపించారు. కబడ్డీ కోర్టులో ప్రత్యర్థి జట్టు రైడర్‌ను బోల్తా కొట్టిస్తూ మన బాలికలు చేసిన టాకిల్స్ ప్రేక్షకులను అబ్బురపరిచి వారెవ్వా అనిపించాయి. మ్యాచ్ ఆడేటప్పుడు ఎలాంటి ఆభరణాలు పెట్టుకోకూడదని అంపైర్లు స్పష్టం చేయడంతో.. ఒక క్రీడాకారిణి కాలి పట్టీలను తోటి క్రీడాకారిణి సహాయంతో తీసి క్రీడా నిబంధనలను గౌరవించింది. అటు వాలీబాల్ కోర్టులో బంతిని ప్రత్యర్థి కోర్టులోకి పంపేందుకు బాలికలు అద్భుతమైన టెన్నిస్ సర్వీస్‌లతో పాయింట్ల వర్షం కురిపించారు. భానుడి ప్రతాపానికి మైదానం వేడెక్కినా బాలికల ఉత్సాహం మాత్రం తగ్గలేదు.


