● జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్
జ్యోతినగర్: ఎస్టీల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. గురువారం ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు కార్యకలాపాలు, ఉద్యోగుల పని పరిస్థితులు, సంస్థలో అమలవుతున్న వివిధ సంక్షేమ చర్యలను తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు. షెడ్యూల్డ్ తెగల ఉద్యోగుల సంక్షేమం, రిజర్వేషన్ విధానం అమలు, సమాన అవకాశాలు, శిక్షణ, అభివృద్ధి కార్యక్రమాలు, ఫిర్యాదుల పరిష్కారంపై జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ ప్రత్యేకంగా దృష్టి సారించిందని అన్నారు.
ఉద్యోగులతో ముఖాముఖి
ఎస్టీ ఉద్యోగులు, ఉద్యోగుల సంఘం ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలు, సూచనలు, సమస్యలను తెలుసుకున్నారు. ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించడంతోపాటు, వారి అభివృద్ధి, సాధికారతకు ఉద్దేశించిన సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలయ్యేలా చూడాలని ఆయన సూచించారు.
గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై చర్చ
ఎన్టీపీసీ సంస్థ చేపడుతున్న సీఎస్సార్ కార్యక్రమాలను కమిషన్ ప్రతినిధి బృందం పరిశీలించింది. గిరిజనులు, ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లోని ప్రజల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను యాజమాన్యం కమిషన్‌కు వివరించింది. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడి వెంట డైరెక్టర్ డాక్టర్ పి.కళ్యాణ్‌రెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు.


