● జిల్లావ్యాప్తంగా దంచికొట్టిన వాన
● అయినా 5 మండలాల్లో లోటే
కరీంనగర్‌అర్బన్: కొన ఊపిరితో ఉన్న పంటలకు వర్షం జీవం పోసింది. మూడు రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండగా వాగులువంకలు, మినీ చెరువులు జలకళ సంతరించుకున్నాయి. పల్లె, పట్నం తేడా లేకుండా వర్షాలు దంచికొడుతుండగా పలుచోట్ల వరద ఏరులైపారింది. జిల్లాలో వ్యవసాయ రంగమే కీలకం. 65శాతం మంది సాగును నమ్ముకునే జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో కళ్లల్లో వత్తులు వేసుకుని వాన కోసం నిరీక్షించారు.
చెరువులకు జలకళ.. పారుతున్న వాగులు
ఎగువన ఎస్సారెస్పీ జలాశయంలోకి ఎగువ నీరు వస్తుండగా, మధ్యమానేరు జలాశయం దాదాపు నిండుకోగా దిగువ మానేరు నీటి మట్టం పెరుగుతోంది. జిల్లావ్యాప్తంగా కరీంనగర్, హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్లుండగా 1,376 చెరువులున్నాయి. దిగువ మానేరు జలాశయం, శనిగరం ప్రాజెక్టు, మధ్యమానేరు, ఎగువమానేరు జలాశయాలకు ఒకింత జలకళ సంతరించుకోగా వస్తున్న వరద నీటితో చెరువులు, కుంటలు కాసింత భరోసానిస్తున్నాయి. కాకతీయ కెనాల్, వరదనీటి కాలువ ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నీరందించే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఆశాజనకంగా నీరు చేరనుందని సమాచారం.
10వేల ఎకరాలకు పైగా బీడే
జిల్లాలో పంటల సాగు సరళి పరిశీలిస్తే ఎల్‌నినో ప్రభావం పడింది. వానాకాలం పంటల సాగు అంచనా 3,44,420 ఎకరాలు కాగా 3,34,028 ఎకరాల్లో మాత్రమే పంటలు సాగయ్యాయి. గతంలో ఇదే సమయంలో 3,44,446 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. పెసలు, కందులు, మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరగగా వరి సాగు అంచనాకు 13,266 ఎకరాలు తగ్గింది.
మూడు మండలాల్లో సాధారణానికి మించి
మూడురోజులుగా వర్షం కురుస్తుండగా ఆది, సోమవారాల్లో దంచికొట్టింది. అయినా జిల్లావ్యాప్తంగా 5 మండలాల్లో లోటు వర్షపాతమే నమోదవడం ఆందోళనకర పరిణామం. కొత్తపల్లి, వీణవంక, హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట మండలాలను లోటు వర్షపాతమే వెంటాడుతోంది. గంగాధర, రామడుగు, గన్నేరువరం మండలాల్లో సాధారణానికి మించి నమోదవగా చొప్పదండి, కరీంనగర్ రూరల్, కరీంనగర్ అర్బన్, మానకొండూరు, తిమ్మాపూర్, చిగురుమామిడి, సైదాపూర్, శంకరపట్నం మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.
జిల్లాలో వర్షపాత వివరాలిలా
నెల సాధారణం నమోదైన వర్షం
వర్షపాతం పడినరోజులు
జూన్ 124.5 84.7 08
జూలై 237.7 243.5 12
ఆగస్టు 203.6 146.7 16
సెప్టెంబర్ 83.6 95.5 05(ఇప్పటివరకు)
వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం
మండలం వర్షపాతం సెంటి మీటర్లలో
శంకరపట్నం (తాడికల్) 9.9
రామడుగు (గుండి) 8.4
చిగురుమామిడి (ఇందుర్తి) 7.7
మానకొండూరు(ఈదులగట్టెపల్లి) 4.9
గంగాధర (బూరుగుపల్లి) 4.6
చొప్పదండి (ఆర్నకొండ) 4.0
సైదాపూర్ (వెన్కెపల్లి) 3.8
వీణవంక 3.8
కరీంనగర్‌రూరల్ (దుర్శేడ్) 3.5
జమ్మికుంట 3.3
కొత్తపల్లి(అసిఫ్‌నగర్) 2.9
గన్నేరువరం (ఖాసీంపేట) 2.7
కరీంనగర్‌అర్బన్ 2.5
తిమ్మాపూర్(రేణికుంట) 2.4
ఇల్లందకుంట(మల్యాల) 2.1
హుజూరాబాద్(బోర్నపల్లి) 2.0


