మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

Sep 16 2026 3:25 AM | Updated on Sep 16 2026 3:25 AM

చొప్పదండి: రెండు పెళ్లిల్లు జరిగినా విడాకులు కావడంతో మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని ఆర్నకొండలో జరిగింది. ఎస్సై నరేశ్‌రెడ్డి కథనం ప్రకారం.. ఆర్నకొండకు చెందిన గంగాధర గంగయ్యకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు నాగరాజు (33) కారు డ్రైవర్‌గా పని చేస్తుండేవాడు. 2016లో వివాహం చేయగా కొద్ది రోజులకే భార్యతో విడాకులయ్యాయి. అనంతరం మరో వివాహం జరిపించగా గతేడాది రెండో భార్యతో కూడా విడాకులయ్యాయి. దీంతో మద్యానికి బానిసైన నాగరాజు ఈ నెల 13న స్నేహితులతో మద్యం తాగడానికి వెళ్లగా రాత్రి అతడి తమ్ముడు అనిల్‌ ఇంటికి తీసుకువచ్చాడు. తిరిగి ఉదయం లేచి చూసేసరికి తన గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతిచెంది ఉన్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

పీజీ సీటు రాలేదని వైద్యుడి..

కరీంనగర్‌రూరల్‌: తీగలగుట్టపల్లికి చెందిన ఎంబీబీఎస్‌ డాక్టర్‌ గౌతమ్‌ (39) పీజీలో సీటు రాలేదని ఆత్మహత్య చేసుకున్నట్లు కరీంనగర్‌రూరల్‌ సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. గౌతమ్‌ ఎంబీబీఎస్‌ పూర్తి చేసి కాంట్రాక్టు పద్ధతిలో ధర్మారం మండలం నందిమేడారం పీహెచ్‌సీలో వైద్యుడిగా పనిచేస్తున్నాడు. నెల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేశాడు. రెండు పర్యాయాలు పీజీ సీటు కోసం ప్రవేశపరీక్ష రాసినా మెరిట్‌ మార్కులు రాక సీటు లభించలేదు. కొంతకాలంగా మనోవేదనతో ఉన్న గౌతమ్‌ ఆదివారం రాత్రి గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం తల్లిదండ్రులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

ఉరేసుకొని యువకుడి..

వేములవాడరూరల్‌:వేములవాడరూరల్‌ మండలం మర్రిపల్లికి చెందిన గొర్రె అవినాశ్‌(22) సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని మృతి చెందినట్లు ఎస్సై ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. అవినాశ్‌ బైండ్ల పని చేస్తూ వచ్చిన డబ్బుతో మద్యం సేవిస్తూ డబ్బులు వృథాగా ఖర్చు చేస్తుండేవాడని అన్నారు. తల్లిదండ్రులు చాలాసార్లు చెప్పినప్పటికీ వినకుండా సోమవా రం రాత్రి అతిగా మద్యం సేవించి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.

మైనర్‌ బాలికను వేధించిన యువకుడి రిమాండ్‌

శంకరపట్నం: మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్‌ బాలికను పెళ్లి చేసుకుంటానని వేధింపులకు గురిచేసిన నిందితుడిని మంగళవారం పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. రేకుర్తికి చెందిన నగూర్‌ రవి బాలికను పెళ్లి చేసుకోవాలంటూ వేధించడంతో బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్‌ చేసి హుజూరాబాద్‌ కోర్టులో ప్రవేశపెట్టామని, న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారని ఎస్సై శేఖర్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement