● టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్ రెడ్డి ● దుర్శేడ్ 220 కె.వీ.సబ్‌స్టేషన్ అకస్మిక తనిఖీ
కొత్తపల్లి(కరీంనగర్): పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా చర్యలు చేపట్టాలని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్‌రెడ్డి ఆదేశించారు. కరీంనగర్ జిల్లా దుర్శేడ్‌లోని 220 కే.వీ. విద్యుత్ సబ్‌స్టేషన్‌ను శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. లోడ్ పరిస్థితులు, విద్యుత్ ప్రసార తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. గ్రిడ్ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, విద్యుత్ సరఫరాలో సాంకేతిక లోపాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని, ట్రాన్స్‌ఫార్మర్లు, ఫీడర్ల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్‌కో ఎస్‌ఈ శ్రీనివాస్, ఎస్‌ఈ (ఆపరేషన్స్) ఏ.విజయేందర్‌రెడ్డి, డీఈ టెక్నికల్ ఉపేందర్, డీఈ (ఆపరేషన్) జంపాల రాజం పాల్గొన్నారు.
విద్యుత్ భద్రతకు పెద్దపీట
కొత్తపల్లి(కరీంనగర్): విద్యుత్ ప్రమాదాలను పూర్తిగా నివారించి ‘జీరో యాక్సిడెంట్’ లక్ష్యాన్ని సాధించేందుకు కరీంనగర్ సర్కిల్ పరిధిలో సమగ్ర భద్రతా చర్యలు చేపడుతున్నట్లు ఎస్‌ఈ ఏ.విజయేందర్ రెడ్డి తెలిపారు. జనవరి నుంచి ఇప్పటివరకు వదులుగా ఉన్న విద్యుత్ లైన్ల వద్ద 3,011 మిడిల్ పోల్స్, బలహీనంగా ఉన్న స్తంభాల స్థానంలో 1,694 నూతన స్తంభాలు ఏర్పాటు చేసినట్లు తెలి పారు. పశువులు, రైతులకు ప్రమాదాలు జరగకుండా 78 ట్రాన్స్‌ఫార్మర్ గద్దెల ఎత్తు పెంచినట్లు వెల్లడించారు. పాత విద్యుత్ లైన్ల స్థానంలో 9,143 మీటర్ల మేర నూతన లైన్లు ఏర్పాటు చేయడంతో పాటు, సరైన ఎర్తింగ్ లేని 2,514 ప్రాంతాల్లో ఎర్తింగ్ వ్యవస్థలను సరిచేసినట్లు తెలిపారు. ఫీడర్లలో ఇండక్షన్ ఏర్పడే అవకాశం ఉన్న 520 ప్రాంతాలను గుర్తించి సాంకేతిక చర్యలు చేపట్టినట్లు వివరించారు.


