ఇంకా ప్రారంభం ఎన్నడో?
కరీంనగర్ అర్బన్: జిల్లా పరిపాలనకు కేంద్రం కలెక్టరేట్. జిల్లాలో ఏ పథకం అమలైనా, పనులేవైనా ఇక్కడి నుంచే అమోదం పొందాలి. అయితే సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనం ప్రారంభానికి నోచుకోవడం లేదు. మంత్రులు, రాష్ట్రస్థాయి అధికారులు సమీక్షలకు పాత కలెక్టరేట్‌కు వస్తుండగా పక్కనే ఉన్న కొత్త భవన ప్రారంభాన్ని మరవడం విమర్శలకు తావిస్తోంది. 2021 డిసెంబర్‌లో నూతన కలెక్టరేట్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఏళ్లుగా సాగదీయగా ప్రారంభించేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు.
అద్దెల మోత
2021లో అప్పటి మంత్రి గంగుల కమలాకర్ నూతన కలెక్టరేట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయగా 2022లోనే పనులు పూర్తవ్వాలి. ఉమ్మడి రాష్ట్రంలో 80విభాగాల వరకు ఉండగా చిన్న, చిన్న విభాగాలను ఒకేశాఖలో విలీనం చేయడంతో మొత్తం 43 శాఖలుగా కుదించారు. కలెక్టరేట్‌లోనే సదరుశాఖలు విధులు నిర్వహించగా నాలుగైదు శాఖలు అద్దె భవనాల్లో ఉండేవి. కలెక్టరేట్ సగభాగం కూల్చివేతతో 15 విభాగాల వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో అద్దె భవనాల్లో సేవలందిస్తున్నాయి. సదరు విభాగాలకు ప్రతి నెలా రూ.లక్షల్లో అద్దె భారం పడుతుండగా నిర్మాణం సాగదీస్తుండటంతో అదనపు భారం తప్పడం లేదు.
అవాంతరాలు తొలగేనా?
నూతన జిల్లాల ఏర్పాటు క్రమంలోనే కలెక్టరేట్ నిర్మాణం జరగాల్సి ఉండగా జాప్యం చేస్తూ వచ్చారు. కరీంనగర్‌లో తొలుత స్థల సమస్య వెంటాడగా లక్షన్నర చదరపు అడుగులు ఉండాలన్న ఆదేశాల క్రమంలో హెలిప్యాడ్ స్థలాన్ని కలెక్టరేట్ కోసమే సేకరించారు. హెలిప్యాడ్ స్థలం 8ఎకరాల వరకు ఉండటం 18 ఎకరాలకు పైగా ప్రస్తుత కలెక్టరేట్ ఉందని అధికారుల అంచనా. కొత్త కలెక్టరేట్ నిర్మాణానికి 2018 మే నెలలో రూ.51కోట్లు మంజూరు చేశారు. ఇంజినీరింగ్ విభాగం నిపుణులు మరికొంతకాలం భవన నాణ్యతకు డోకా లేదని నివేదించడంతో బ్రేక్ పడింది. 2021లో నూతన భవన నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. నూతన భవనలో సుమారు వెయ్యి మంది కూర్చునేందుకు వీలుగా సమావేశమందిరం, రెండు చిన్న సమావేశమందిరాలు, రెండు వీడియో కాన్ఫరెన్స్ గదులు, క్యాంటీన్, కలెక్టరేట్ చుట్టు తిరిగేలా రహదారులు, పచ్చదనం పెంచేలా ఖాళీస్థలం, వాహనాల పార్కింగ్ వంటివి ఏర్పాటు చేశారు.
నూతన భవనాన్ని గత నెల 16న ప్రారంభిస్తారని అధికార యంత్రాంగం భావించింది. కార్యాలయాల తరలింపుపై కలెక్టర్ చిత్రా మిశ్రా సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వస్తారని భావించగా అంతలోనే అమెరికా పర్యటన క్రమంలో సందిగ్ధం నెలకొంది. ఇటీవల జరిగిన తాజా రాజకీయ పరిణామాల క్రమంలో ప్రారంభోత్సవంపై నీలినీడలు కమ్ముకున్నాయి.
సమీకృత కలెక్టరేట్ నిర్మాణ శంకుస్థాపన:
2021 డిసెంబర్ 29
అంచనా విలువ: రూ.51 కోట్లు
పూర్తవ్వాల్సిన గడువు: డిసెంబర్ 2022
పూర్తయింది: ఆగస్టు 2026


