సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీజీపీఎస్) మంజూరైంది. రాష్ట్రవ్యాప్తంగా 73 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌లో వసతుల కల్పనకు రూ.699.895 కోట్ల అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం 2026 సెప్టెంబర్ 5న జీవో నంబరు 164 జారీ చేసింది. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లా చిగురుమామిడి పాఠశాలను తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా ఎంపిక చేశారు. ఈ పాఠశాల అభివృద్ధికి రూ.9.62 కోట్లు కేటాయించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ద్వారా ప్రీప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ఆధునిక వసతులతో కూడిన నాణ్యమైన విద్యను అందించడంతో పాటు సమగ్ర అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.
హైలెవల్ బ్రిడ్జికి రూ.6.60 కోట్ల పరిపాలనా అనుమతులు
హుజూరాబాద్– సుందరగిరి రహదారిపై కిలోమీటర్ 10/0–2 వద్ద హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.6.60 కోట్ల పరిపాలనా అనుమతి మంజూరు చేసిందని మంత్రి వెల్లడించారు. ఈ బ్రిడ్జితో పరిసర గ్రామాల ప్రజలకు వర్షాకాలంలో రాకపోకలకు ఎదురయ్యే ఇబ్బందులు తగ్గుతాయని తెలిపారు.
పవర్‌కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: విద్యుత్ లైన్లు, చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపడుతున్నందున మంగళవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 11 కె.వీ. సివిల్ ఆసుపత్రి ఫీడర్ పరిధిలోని ఎస్వీజెసీ కళాశాల, జానకి చికెన్‌సెంటర్, రామాలయం, ప్రశాంత్‌నగర్ కాలనీ, రెనె ఆస్పత్రి ప్రాంతాలు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు 11 కె.వీ.క్రిష్టియన్ కాలనీ పరిధిలోని మెడికవర్ వెనక భాగం, సవరన్ వీధి, రెడ్డి రెసిడెన్సీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–1 ఏడీఈ పంజాల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.


