● రాముడు నడియాడిన నేలగా ప్రసిద్ధి
● శ్రావణ మాసంలో పర్యాటకుల సందడి
● పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేయాలని విన్నపాలు
రామగిరి: అద్భుత కళాసంపదకు నిలయమైన రామగిరి ఖిల్లా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట నుంచి కల్వచర్ల వరకు విస్తరించిఉంది. రామయణంలో శ్రీరాముడు వనవాసం సమయంలో ఇక్కడికి వచ్చి తపస్సు చేసి శివలింగం ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెబుతున్నాయి. కొద్దిరోజులపాటు కుటీరం ఏర్పాటు చేసుకుని సీతాలక్ష్మణులతో కలిసి ఉన్నారని పెద్దలు చెబుతారు. ఖిల్లాపై సీతారామలక్ష్మణులు సంచరించినట్లు ఇప్పటికీ చెక్కుచెదరని కొన్ని ఆనవాళ్లు శ్రావణమాసంలో ఖిల్లాపైకి వచ్చే పర్యాటకులకు దర్శనమిస్తాయి. బండరాతిపై శ్రీరాముని పాదాలు, సీతాదేవి స్నానమాచరించిన కొలనుతోపాటు శ్రీరామునితో సంచరించిన ఆంజనేయుని విగ్రహమూ ఉంది. సీతాసమేత శ్రీరాముడు, హనుమాన్ ఉత్సవ విగ్రహాలను ఏటా శ్రావణమాసంతో ఊరేగింపు నిర్వహించి పూజలు చేయడం ఆనవాయితీ.
దర్శనీయ ప్రదేశాలు
ఖిల్లాపై ఏడు కోట ప్రవేశ దర్వాజాలు, 15 ఎత్తయిన శత్రుసైన్యాన్ని పసిగట్టే బురుజులు ఉన్నాయి. మొదటి దర్వాజాకి కుడివైపు వెళ్తే సముద్ర జలపాతం, రెండో దర్వాజ ప్రవేశంలో కుడివైపు గోడలపై క్రీ.శ. 1556 నాటి పదిపంక్తులతో కూడిన తెలుగుశాసనం కనిపిస్తుంది. దర్వాత దాటిన తర్వాత ఎడమవైపు అద్భుతమైన పచ్చనికోట, 25 మీటర్ల పొడవు గలఅతిపెద్ద ఫిరంగి, నాలుగో దర్వాజపై అతిపెద్ద ఫిరంగితోపాటు సృష్టి శిల్పాలతోపాటు ఏనుగుతో పోరాడుతున్న యోధుడి శిల్పం, రెండు తలల గరత్మంతుడి శిల్పం ఉంటాయి. 15 మీటర్ల పొడవుగల పిల్లల ఫిరంగీ ఇక్కడే ఉంటుంది. ఆరో దర్వాజ నుంచి 21 మెట్లు ఎక్కి కోటపై నుంచి కనిపించే మానేరు వయ్యారాలతో పాటు ఖిల్లాపై సీతమ్మ స్నానమాడిన కొలను, పసరు బావులు, పసుపు, కుంకుమ భరణి, సవతుల బావులు, మాధవీమండపం, రాముడు ప్రతిష్ఠించిన శివాలింగాలు, హనుమంతుని విగ్రహం, చరశాలలు, గజశాలలు, ఆశ్వశాలలు, రాజమందిరానికి తరలించిన రాతినీటి గొట్టాలు, చివరగా సీతరాముల దర్శించుకోవచ్చు.
శ్రావణమాసంలో సందడి
వర్షకాలంలో పచ్చదనం పర్చుకోవడంతో ఏటా శ్రావణమాసంలో రామగిరి ఖిల్లాపై పర్యాటకుల సందడితో ఆహ్లాదకరమైన సందడి ఉంటుంది. దుర్గంపై నుంచి ప్రకృతి అందాలను తిలకిస్తూ పర్యాటకులు మైమరిచిపోతారు. ఆయుర్వేద వైద్యులు వనమూలికలను సేకరిస్తారు. పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతామని గతంలో ప్రభుత్వం రూ.5 కోట్లు కేటాయించింది. ప్రాచీన కళలకు నిలయమైన రామగిరిఖిల్లా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో మరిన్ని నిధులు కేటాయించి పనులు నిర్వహించాల్సి ఉంటుంది.
ఖిల్లాకు ఇలా వెళ్లాలి..
పెద్దపల్లి నుంచి మంథని ప్రధాన రహదారిలో సుమారు 20 కిలోమీటర్లు ప్రయాణించి బేగంపేట ఎక్స్‌రోడ్డు(నాగెపల్లి) వద్ద దిగాలి. ఆటో ద్వారా బేగంపేట గ్రామానికి చేరుకుని సుమారు 3 కిలోమీటర్లు కాలినడకన ఖిల్లాకు చేరుకోవచ్చు. ఖిల్లాకు ఉదయం 8 గంటల వరకు చేరుకుంటే.. సాయంత్రం 5 గంటల వరకు చూడాల్సిన ప్రదేశాలు అన్నీ చూసి తర్వాత వెనుదిరిగే అవకాశం ఉంటుంది.


