క్రిటికల్‌ మినరల్స్‌పై సింగరేణి దృష్టి | - | Sakshi
Sakshi News home page

క్రిటికల్‌ మినరల్స్‌పై సింగరేణి దృష్టి

Sep 7 2026 3:14 AM | Updated on Sep 7 2026 3:14 AM

గోదావరిఖని: దేశ ఇంధన రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న సింగరేణి భవిష్యత్‌ తరాలకు అవసరాలకు అనుగుణంగా ముందుకు సాగుతోంది. బొగ్గు ఉత్పత్తికే పరిమితం కాకుండా క్రిటికల్‌ మినరల్స్‌ మైనింగ్‌ రంగంలోకి అడుగులు వేస్తోంది. ఇటీవలే కర్ణాటకలో బంగారం, రాగి గనుల అన్వేషణ టెండర్‌ దక్కించుకుంది. బొగ్గు ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతున్నా.. మరోవైపు సోలార్‌, విండ్‌, బ్యాటరీ స్టోరేజీ, ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఆధునిక ఎలక్ట్రానిక్స్‌ రంగాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లిథియం, కోబాల్ట్‌, నికెల్‌, గ్రాఫైట్‌, రేర్‌ఎర్త్‌ ఎలిమెంట్స్‌ వంటి కీలక ఖనిజాలకు అంతర్జాతీయంగా డిమాండ్‌ పెరుగుతోంది.

బొగ్గు ఉత్పత్తి నుంచి క్రిటికల్‌ మినరల్‌ వైపు

బొగ్గు నిల్వలు తగ్గడం, పర్యావరణ పరిరక్షణ నిబంధనలు కఠినం కావడం, స్వచ్ఛ ఇంధన వినియోగం పెరగడం వంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని సింగరేని కొత్త ఆదాయ వనరులపై దృష్టి పెట్టింది. క్రిటికల్‌ మినరల్స్‌ రంగంలోకి ప్రవేశం ద్వారా కోల్‌ కంపెనీగానే కాకుండా, దేశ ఖనిజ భద్రతలో భాగస్వామ్యం కావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.

మైనింగ్‌ అనుభవం కలిసివచ్చే అంశం

భూగర్భ, ఓపెన్‌కాస్ట్‌ గనుల నిర్వహణలో సింగరేణికి దశాబ్దాల అనుభవం ఉంది. భారీయంత్రాలు, జియోలాజికల్‌ సర్వేలు, మైనింగ్‌ ప్రణాళికలు, భద్రతా వ్యవస్థలు, రవాణా మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఈ అనుభవాన్ని క్రిటికల్‌ మినరల్స్‌ అన్వేషణ, తవ్వకం రంగాల్లో వినియోగించుకోనుంది.

కార్యోణ్ముకులను చేయాల్సిందే..?

క్రిటికల్‌ మినరల్స్‌ రంగంలోకి ప్రవేశించడం ద్వారా కొత్త రకాల ఉద్యోగాలు, సాంకేతిక నైపుణ్యాల అవసరం పెరుగుతుంది. ఇప్పటికే పనిచేస్తున్న కార్మికులకు ఆధునిక మైనింగ్‌ టెక్నాలజీపై శిక్షణ ఇవ్వడం ద్వారా భవిష్యత్‌ అవసరాలకు సిద్ధం చేయాల్సి ఉంటుంది. బొగ్గు ఉత్పత్తి తగ్గితే ఉద్యోగాలు ఏమవుతాయి? అనే ఆందోళనలకు కూడా సింగరేణి కొత్త రంగాల్లోకి విస్తరించడం సమాధానం ఇస్తుందని కార్మిక వర్గాలు భావిస్తున్నాయి.

దేశ ఖనిజ భద్రతలో కీలక పాత్ర

భారత్‌ అనేక కీలక ఖనిజాల కోసం విదేశాలపై ఆధారపడుతోంది. బ్యాటరీలు, ఎలక్ట్రిక్‌ వాహనాలు, సోలార్‌ పరికరాలు, రక్షణ రంగం, ఆధునిక కమ్యూనికేషన్‌ వ్యవస్థలకు అవసరమైన ఖనిజాలను దేశీయంగా గుర్తించి అభివద్ధి చేయడం కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఈ నేపథ్యంలో సింగరేణి వంటి ప్రభుత్వ రంగ సంస్థలు క్రిటికల్‌ మినరల్స్‌ రంగంలోకి రావడం దేశ ఆర్థిక, పారిశ్రామిక అవసరాల పరంగా కీలక పరిణామంగా చెప్పవచ్చంటున్నారు.

ఆస్ట్రేలియా ఆహ్వానం

కీలక ఖనిజాలు పుష్కలంగా ఉన్న ఆస్ట్రేలియాతో కలిసి పనిచేయడానికి ముందుకురావాలని ఆ దేశప్రముఖ పరిశోధన సంస్థ మోనాష్‌ యూనివర్సిటీ సింగరేణికి ఆహ్వానం పలికింది. ఆ దేశ ప్రతినిధి బృందం గతనెల 31న హైదరాబాద్‌ సింగరేణి భవన్‌లో సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాశ్‌జ్యోతితో సమావేశమైంది కూడా.. ముడి ఖనిజాలకే పరిమితం కాకుండా డౌన్‌స్ట్రీమ్‌ ప్రాసెసింగ్‌, రిఫైనింగ్‌ ద్వారా అదనపు విలువను సృష్టించే అవకాశాల గురించి మోనాష్‌ బృందం వివరించింది. ఈ క్రమంలోనే త్వరలో సింగరేణి ఉన్నతస్థాయి అధికార బృందాన్ని ఆస్ట్రేలియాకు పంపేందుకు యాజమాన్యం సిద్ధమైంది.

అనుభవాన్ని పంచుకోవాలని ఆస్ట్రేలియా ఆహ్వానం

ప్రపంచంలోనే క్రిటికల్‌ మినరల్స్‌కు పెరుగుతున్న డిమాండ్‌

ఇప్పటికే బంగారం, రాగి అన్వేషణ దక్కించుకున్న సింగరేణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement