రామగుండం: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జన సాధారణ్ పేరిట ఈనెల 4న సికింద్రాబాద్–సిర్‌పూర్ కాగజ్‌నగ ర్ మధ్య ప్రత్యేక రైలు నడిపించింది. మధ్యా హ్నం 12.10 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరిన రైలుకు ప్రయాణికుల నుంచి స్పందన రాలేదు. ఒక్కోబోగీలో నలుగురైదుగురికి మించి లేరు. జన సాధారణ్ పేరిట ప్రత్యేక రైలు నడిపిస్తున్నట్లు మూడోతేదీ రాత్రి ప్రకటన జారీ చేసింది. మరుసటి రోజే రాకపోకలు సాగించడంతో ప్రచారం లేక ప్రయాణికులకు సమాచారం అందలేదు. ఈ రూట్‌లో నిత్యం రద్దీ అధికంగా ఉంటుంది. ముందస్తు సమాచారం లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. జన సాధారణ్ రైలును రెగ్యులర్‌గా నడిపించేందుకు ట్రయల్ రన్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీని సమయం కూడా మార్చాలని ప్రయాణికులు కోరుతున్నారు.
తాటి, ఈత చెట్ల నరికివేత
బోయినపల్లి(చొప్పదండి): బోయినపల్లి మండలం స్తంభంపల్లిలో కల్లు పారే 200 మేర తాటి, ఈత చెట్లను నరికివేసి కాల్చి బూడిద చేశారని గ్రామ గౌడ సంఘం ఆధ్వర్యంలో గీతకార్మికులు శనివారం సిరిసిల్ల ఎకై ్సజ్ సీఐ శారదకు ఫిర్యాదు చేశారు. చెట్లు నరికివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. గౌడ సంక్షేమ సంఘ అధ్యక్షుడు గోవర్ధన్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి బుర్ర నారాయణగౌడ్, తీగల మల్లికార్జున్‌గౌడ్‌లు సంఘటనను ఖండించారు. సర్పంచ్ బొంగాని అశోక్‌గౌడ్, నాయకులు బొంగాని మల్లేశం తదితరులు ఉన్నారు.
కాంగ్రెస్ కౌన్సిలర్‌పై కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు
మెట్‌పల్లి: మెట్‌పల్లి మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ బత్తుల నరేష్‌పై కమిషనర్ శ్రీనివాస్‌గౌడ్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. తనతోపాటు టౌన్ ప్లానింగ్ (టీపీవో) అధికారి భూపతి, టీపీఎస్ అశోక్, టీపీబీవో యమున విధులకు నరేష్ అడ్డుతగలడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయిస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ అధికారిక విధులకు ఉద్దేశపూర్వకంగా ఆటంకం కలిగించడమే కాకుండా రోజువారీ పరిపాలనలో జోక్యం చేసుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్న అతడిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు.
పోలీసుల అదుపులో ఏడుగురు యువకులు
ఎలిగేడు: గంజాయి సేవిస్తున్న ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై మధుకర్ తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆదేశాలమేరకు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్‌రావు నేతృత్వంలో ఎస్సైలు లక్ష్మణ్, మధుకర్, పోలీసులు శనివారం ఎలిగేడు పరిధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఏడుగురు యువకులను అదుపులోకి తీసుకుని విచారించగా గంజాయి తాగినట్లు వెల్లడించారు. వైద్యపరీక్షల నిమిత్తం గోదోవరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. డీ–అడిక్షన్ సెంటర్‌కు పంపించేందుకు చర్యలు చేపడుతున్నారు.


