జోరుగా మెడి‘కిల్’ దందా
మాత్రల రూపంలో మరణశాసనం
యువతను మింగేస్తున్న డ్రగ్స్ మాఫియా
అధికారులు రారు.. తనిఖీ చేయరు
‘గత నెల 28న డ్రగ్స్‌కు బానిసైన 9 మంది యువకులను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మెడికల్ షాపుల్లో మత్తు ట్యాబ్లెట్లు కొనుగోలు చేసి, కరిగించి సిరంజీల ద్వారా నరాల్లోకి ఎక్కించుకుంటున్నారని గుర్తించారు. ప్రిస్కిప్షన్ లేకుండా మందులు విక్రయాలు చేస్తున్న మెడికల్ షాపు యజమానిని అరెస్ట్ చేశారు.’
‘ప్రిస్కిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తున్న ఫిర్యాదుల మేరకు ఈనెల 2న డ్రగ్ అధికారులు జిల్లాకేంద్రంలోని పలు మెడికల్ షాపుల్లో తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న 10 మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో సమస్య ఏ స్థాయిలో
ఉందో అర్థమవుతోంది.’
కరీంనగర్:
ఔషధం పేరుతో విషం విక్రయమవుతోందా..? ప్రాణాలు కాపాడాల్సిన మందుల దుకాణాలే యువతను మత్తు ఊబిలోకి నెడుతున్నాయా..? నొప్పి నియంత్రించే స్టెరాయిడ్లు, సోయిలేకుండా నిద్రపట్టేందుకు స్లీపింగ్ పిల్స్, తక్కువ ధరలోనే మత్తులో తూగేందుకు దగ్గు మందు, పెయిన్‌కిల్లర్స్.. ఇలా మెడికల్ స్టోర్లలో మత్తు మందుల విక్రయాల జోరు కొనసాగుతోంది. జిల్లాలో తాజాగా వెలుగుచూసిన ఘటనలు ఇందుకు నిదర్శనం. జిల్లావ్యాప్తంగా సుమారు 1,200 మెడికల్ షాపులు ఉన్నాయి. వాటిలో నిబంధనలు ఎంతమేరకు అమలవుతున్నాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.
గంజాయి, డ్రగ్స్‌కు ప్రత్యామ్నాయంగా
గంజాయి ఇతర డ్రగ్స్‌పై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించడంతో నిషా కోసం యువత కొత్తదారులు వెతుకుతోంది. ఇదే అదనుగా కొందరు మెడికల్ షాపు నిర్వాహకులు నొప్పి నివారణ, మానసిక వ్యాధుల చికిత్సలో వాడే ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లను అడ్డదారుల్లో అమ్ముతున్నాయి. వీటిని ఎక్కువ మోతాదులో తీసుకొని యువత మత్తులో జోగుతోంది. గతంలోనూ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించిన వారికి నోటీసులు ఇవ్వడం, తర్వాత వ్యవహారం చల్లబడటం పరిపాటిగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
తూతూ మంత్రంగా తనిఖీలు...
యువత కొన్ని రకాల మాత్రలు, సిరప్‌లను మత్తు కోసం వినియోగిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. వీటిని కట్టడి చేయడంలో డ్రగ్స్ నియంత్రణ అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపుతున్నామంటూ కేవలం నోటీసులతో సరిపెడుతూ, తూతూమంత్రంగా దాడులు చేస్తుండటంతో మెడికల్ షాపుల యజమానుల్లో భయం కానరావడం లేదు. ఇతర జిల్లాల్లో తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన షాపుల లైసెన్సులను రద్దు చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేసిన దాఖలాలు ఉన్నాయి. జిల్లాలో కంటితుడుపు తనిఖీలతో సరిపెడుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల అవసరాలను ఆసరా చేసుకొని
జలుబు జ్వరం మొదలు పెద్ద వ్యాధులతో బాధపడుతున్న వారిలో పలువురు స్వయం చికిత్సకోసం మెడికల్ షాపులపై ఆధారపడుతున్నారు. అదే సమయంలో మెడికల్ షాపుల యజమానులు డాక్టర్ల మాదిరిగా సలహాలు ఇస్తూ మందులు అమ్మడం సర్వసాదారణంగా మారింది. వాస్తవానికి గ్రామీణ ప్రాంత ప్రజలు ఆసుపత్రుల ఫీజులు భరించలేక జ్వరం, దగ్గు, విరేచనాలు అయితే తాత్కాలిక ఉపశమనం కోసం మెడికల్ షాపులను ఆశ్రయిస్తున్నారు. వీరి అవసరాన్ని గమనించిన మందుల షాపుల యజమానులు తమకు ఇష్టమొచ్చిన మాత్రలతో పాటు అదనంగా ప్రతి రోగానికి యాంటిబయోటిక్స్‌ను జతచేసి విక్రయిస్తున్నారు. మరికొందరైతే మిడిమిడి జ్ఞానంతో ఇంజక్షన్లు సైతం విక్రయిస్తున్నారు. ఇదే విషయమై డ్రగ్స్ ఇన్స్‌పెక్టర్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా స్పందించలేదు.


