నమ్మకం పంచన.. నిలువునా వంచన..! | - | Sakshi
Sakshi News home page

నమ్మకం పంచన.. నిలువునా వంచన..!

Sep 4 2026 7:53 AM | Updated on Sep 4 2026 7:53 AM

‘ఇటీవలే మా మనవరాలికి పెళ్లి అయింది. మా మనవడి(పెళ్లి కొడుకు)కి పెద్ద సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం.. ఇద్దరూ బెంగుళూర్‌లో ఉంటారు. అంతా బాగానే ఉంది కానీ, మనవడు మా మనవరాలి మాటలు అసలు వినడం లేదు. వాళ్ల అమ్మా నాన్న, చెల్లెలి మాటలు వింటూ.. మా మనవరాలిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎలాగైనా అతను మా మనవరాలి చెప్పుచేతుల్లోకి రావాలి. ఎంత ఖర్చు అయినా సరే నేను ఇస్తాను. మా మనవరాలి మాటలు వినాలి’ అంటూ ఓ 60 ఏళ్ల వృద్ధురాలు సిరిసిల్లలోని ఓ భూతవైద్యుడిని సంప్రదించింది. సదరు భూతవైద్యుడు రూ.25వేలు తీసుకుని విభూది ఇచ్చాడు. ‘మీ మనవడు పడుకున్నాక అరికాళ్లకు ఈ విభూదిని అతడికి తెలియకుండా రాస్తే.. నెల రోజుల్లో తప్పకుండా మీ మనవరాలి వశం అవుతాడు’ అని సలహా ఇచ్చాడు.

‘రుద్రంగికి వెంకటేశంకు ఆరోగ్యం బాగుండడం లేదు. ఎన్ని మందులు వాడినా రోగం పోతలేదు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లోని ఓ ఆశ్రమాన్ని ఆశ్రయించాడు. మీ దగ్గరికి వస్తే.. బాగు అవుతుందని చెప్పారు. మీరు తాయత్తు కడితే.. జబ్బు నయం అవుతుందని విన్నాను ఎలాగైనా.. మీరే బాగు చేయాలి అని అక్కడి మాంత్రికుడిని కోరాడు.. నీకు మీ ఇంటి ముందు ఆమె మంత్రాలు చేసింది. ఆమె కన్ను పడి మీకు అనారోగ్య సమస్య వచ్చిందని సదరు మాంత్రికుడు నమ్మబలికాడు. ఆ మంత్ర ప్రభావం పోవాలంటే.. నేను ఇచ్చే తాయత్తు కట్టుకుంటే చాలని నమ్మించి రూ.50వేలు కాజేశాడు. ఆరోగ్య సమస్యలకు ఆస్పత్రిలోనూ చూపించుకోవాలని సలహా ఇచ్చాడు.’

సిరిసిల్ల: ఆధునిక సమాజంలో శాస్త్రవిజ్ఞానం, సాంకేతిక విప్లవం పల్లవిస్తున్న తరుణంలోనూ మూఢనమ్మకాల జాఢ్యం వీడడం లేదు. అరచేతిలోనే ప్రపంచాన్ని చూస్తున్న ఈ రోజుల్లో మంత్రాలు, మాయలు, తాయత్తులు, విభూది మాయాజాలం, క్షుద్రపూజల ప్రభావానికి ఇంకా కొందరు లోనవుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొన్ని సామాజిక వర్గాలు ఇదే వృత్తిగా జీవిస్తూ.. సమాజాన్ని నమ్మకంగా దోపిడీ చేస్తున్నాయి. జిల్లాలోని కొన్ని గ్రామాల్లో నివాసం ఉంటూ.. సంచార జీవనం సాగించే కొందరు, మూఢవిశ్వాసాలను పెంచుతూ అందినకాడికి దోచుకుంటున్నారు. మాటలే పెట్టుబడిగా బురిడీ కొట్టిస్తున్నారు. వేషం, భాష మార్చి నమ్మకంగా మాట్లాడుతూ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని, వాటిని వెలికి తీస్తామంటూ, ఇంటికి దోషం పట్టిందని, ఆ దోషాన్ని తొలగిస్తామంటూ వారి బలహీనతను ఆసరా చేసుకుంటూ సమాజంలోని కొందరిని నిలువు దోపిడీ చేస్తున్నారు.

జిల్లాలో క్షుద్రపూజల అడ్డాలు

సిరిసిల్ల పట్టణంలోని సాయినగర్‌, బీవై నగర్‌, విమల్‌ థియేటర్‌ ఏరియా, పెద్దూరు, వేములవాడ మండలం అగ్రహారం, చీర్లవంచ, వేములవాడ మండలం తిప్పాపూర్‌, ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌, సిద్దిపేట జిల్లా దుబ్బాక వంటి ప్రాంతాల్లో ఈ తరహా మూఢనమ్మకాలను సొమ్ము చేసుకునే గురువులు ఉన్నారు. వీరంతా వారి వద్దకు వచ్చేవారితో నమ్మకంగా మాట్లాడుతూ, వారి బలహీనతను ఆసరా చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. కొన్ని సంచార జాతులకు చెందినవారు ఇదే వృత్తిగా ‘లక్ష’ణంగా దోచేస్తూ.. ఖరీదైన కార్లు కొని, వాటిలో తిరుగుతూ క్షుద్రపూజల పేరిట అక్రమాలకు పాల్పడుతున్నారు.

చర్చనీయాంశమైన రూ.65 లక్షల బురిడీ

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేసిన కరీంనగర్‌కు చెందిన తూరుపాటి శ్యాంకుమార్‌, అగ్రహారంకు చెందిన పత్తెం లక్ష్మీరాజంలు హైదరాబాద్‌ ఉప్పల్‌కు చెందిన బండారి లత అనే మహిళ వద్ద ఏకంగా రూ.65లక్షలు దశల వారీగా ఐదు నెలల్లో వసూలు చేయడం విశేషం. ఇంత భారీ మొత్తంలో డబ్బు వసూలు చేస్తూ.. యాదగిరిగుట్ట, కాశీలో పూజలు నిర్వహిస్తూ.. ఆమె ఆరోగ్య బాగవుతుందని నమ్మించారు. ఐదు నెలల్లో ఆరోగ్యం బాగా అవకపోగా మరింత క్షీణించడంతో క్షుద్రపూజలు ఉత్తవేనని తేలిపోయింది. దీంతో డబ్బులు తిరిగి ఇవ్వమని నిలదీయడంతో వారి బండారం బయటపడింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శ్యాంకుమార్‌, లక్ష్మీరాజం అరెస్ట్‌ కాగా, వారి వద్ద రూ.30.50లక్షలు రికవరీ చేశారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంగా ఇంత భారీ మొత్తంలో భూతవైద్యుల వద్ద రికవరీ కావడం చర్చనీయాంశమైంది. జిల్లాలో జరుగుతున్న మూఢనమ్మకాల అక్రమాలు తెరపైకి వచ్చాయి.

‘లక్ష’ణంగా దోచేస్తున్నారు

తాయత్తులు.. గిమ్మిక్కులు

భూతవైద్యం.. క్షుద్రపూజలు

సమాజాన్ని వీడని మూఢనమ్మకాల జాఢ్యం

రూ.65లక్షలు దోచి.. జైలుకెళ్లిన పూజారులు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గుట్టుగా అక్రమ దందా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement