గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని తిలక్‌నగర్‌డౌన్‌కు చెందిన ఓసీపీ–2 జనరల్ అసిస్టెంట్ బొడ్డు నర్సింగరావు(61) మంగళవారం అకస్మాత్తుగా మృతి చెందాడు. కొంతకాలంగా లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతూ పలు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుంటున్నాడు. మంగళవారం ఉదయం మూత్ర విసర్జనకు ఇంట్లోంచి బయటికి వెళ్లి తిరిగి వస్తుండగా నీరసించాడు. భార్య టాబ్లెట్స్ తీసుకొచ్చేందుకు గదిలోకి వెళ్లివచ్చేలోగా అపస్మారక స్థితికి చేరాడు. వెంటనే అంబులెన్స్‌లో సింగరేణి ఏరియా ఆస్పస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. మృతునికి కొడుకు, కూతురు ఉన్నారు. మృతుని కుమారుడు బొడ్డు శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ సురేందర్ కేసు నమోదు చేసుకున్నారు.
బైక్ పైనుంచి పడి ఒకరు..
యైటింక్లయిన్‌కాలనీ: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని –యైటింక్లయిన్‌కాలనీలో నివాసం ఉంటూ ఆర్జీ–2ఏరియా వకీల్‌పల్లి గనిలో జనరల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న గోగు వినోద్ (34) మంగళవారం ప్రమాదవశాత్తు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. కాలనీ పెట్రోల్ బంక్ నుంచి పోతనకాలనీలోని కిరాణానికి వెళ్తుండగా ఒక్కసారిగా బైక్ పైనుంచి పడిపోయాడు. ఆ వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. స్థానికులు 108లో గోదావరిఖని సింగరేణి ఆస్పత్రికి తరలించగా.. పరిక్షించిన వైద్యు.. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య లతిత ఫిర్యాదు మేరకు సీఐ లింగమూర్తి కేసు నమోదు చేసుకొన్నారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు.
నవోదయలో దరఖాస్తులకు ఆహ్వానం
చొప్పదండి: పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో 2027–28 విద్యా సంవత్సరంలో ఖాళీగా ఉన్న తొమ్మిదోతరగతి, పదకొండో తరగతి సీట్ల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. భర్తీ కోసం నిర్వహించే లిటరల్ ఎంట్రీ సెలక్షన్ టెస్టు–2027కు ఆన్‌లైన్ ద్వారా సెప్టెంబర్ 30వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గంగాధర, హుజురాబాద్, కరీంనగర్, మహదేవపూర్, మంథని, పెద్దపల్లి, సిరిసిల్ల, సుల్తానాబాద్, వేములవాడ, జగిత్యాల, మల్యాల, మెట్‌పల్లి బ్లాక్‌లలో ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు తొమ్మిదవ తరుగతిలోకి, ప్రస్తుతం పదవ తరుగతి చదువుతున్న విద్యార్థులు పదకొండో తరగతిలోకి ప్రవేశానికి అర్హులని, వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ప్రవేశ పరీక్ష జరుగుతుందని తెలిపారు. నవోదయ వెబ్‌సైట్‌లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


