జ్యోతినగర్: పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్ పరిధి టీటీఎస్ గోదావరి భవన్ ఎదుట ఉన్న భక్తాంజనేయస్వామి ఆలయంలో జరిగిన వెండి ఆభరణాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఎస్సై ఉదయ్ కిరణ్ కథనం ప్రకారం.. గతంలో పలు కేసుల్లో నిందితుడు పోయిల రాజు (34)ను అరెస్ట్ చేసి, వెండి ఆభరణాలు, కాంస్య విగ్రహం, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఆలయ పూజారి సురేశ్‌శర్మ ఆగస్టు 3న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తలుపులకు కన్నం వేసి లోపలికి ప్రవేశించిన నిందితుడు స్వామివారి 77 తులాల వెండి ఆభరణాలు, హనుమాన్ ఉత్సవ కాంస్య విగ్రహం, రెండు పెద్దకాంస్య దీపాలు, కాంస్య మంగళహారతి, రూ.1,000 నగదు అపహరించినట్లు దర్యాప్తులో తేలింది. పలు కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసును చాకచక్యంగా దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేయడంతోపాటు చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న ఎస్‌ఐ ఉదయ్‌కిరణ్, పోలీసు సిబ్బందిని రామగుండం సీఐ కృష్ణకుమార్, ఏసీపీ రమేశ్ అభినందించారు.
నిందితుడి అరెస్ట్.. సొత్తు స్వాధీనం


