‘ప్రేమ’కు ప్రోత్సాహం | - | Sakshi
Sakshi News home page

‘ప్రేమ’కు ప్రోత్సాహం

Sep 1 2026 12:31 AM | Updated on Sep 1 2026 12:31 AM

దరఖాస్తు చేస్తే సాయం

కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం

82 జంటలకు రూ.2.40కోట్లు మంజూరు

సీనియారిటీ ప్రకారం పెండింగ్‌ దరఖాస్తుల పరిష్కారం

కరీంనగర్‌టౌన్‌: కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం అర్హులైన జంటలకు అండగా నిలుస్తోంది. ముఖ్యంగా ఎస్సీ వర్గానికి చెందిన యువతీయువకులు కులాంతర వివాహాలు చేసుకుంటే ప్రభుత్వం అందించే ప్రోత్సాహకం వారికి ఆర్థిక భరోసా కల్పిస్తోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను సీనియారిటీ ప్రకారం పరిశీలిస్తూ విడతలవారీగా నిధులు విడుదల చేస్తోంది. 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు కరీంనగర్‌ జిల్లాలో 82 ఎస్సీ కులాంతర వివాహ జంటలకు రూ.2.40కోట్ల ప్రోత్సాహకాలు మంజూరయ్యాయి. 2022–23లో అందిన అన్ని దరఖాస్తులకు సంబంధించిన ప్రోత్సాహకాల పంపిణీ ఇప్పటికే పూర్తయింది. 2024లో వచ్చిన 40, 2025లో వచ్చిన 63 దరఖాస్తులు.. మొత్తం 103 దరఖాస్తుల పరిశీలన పూర్తి కాగా.. నిధులు విడుదల కావాల్సి ఉంది.

మూడేళ్లకు ఎఫ్‌డీ

ఎస్సీ అభివృద్ధి శాఖ నిబంధనల ప్రకారం కులాంతర వివాహం చేసుకున్న ఒక్కో ఎస్సీ జంటకు రూ.2.50లక్షల చొప్పున ప్రోత్సాహకం అందజేస్తున్నారు. ఈ మొత్తాన్ని నేరుగా నగదు రూపంలో ఇవ్వకుండా దంపతుల్లో ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి పేరిట చెక్కు జారీ చేసి, బ్యాంకులో మూడేళ్ల కాలానికి ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తున్నారు. గడువు పూర్తయిన తర్వాత బాండ్‌ను రద్దు చేసుకొని నగదు పొందే అవకాశముంటుంది. ఎస్సీలతోపాటు ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారు కులాంతర వివాహాలు చేసుకున్నా.. ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఎస్టీ జంటలకు రూ.50వేలు, బీసీ జంటలకు రూ.10వేల చొప్పున అందజేస్తోంది.

ఏడాది లోపు దరఖాస్తు

కులాంతర వివాహం చేసుకున్న జంటలు పెళ్లయిన ఏడాది లోపు ఈ–పాస్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. గడువు దాటితే దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశముంటుంది. దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి.. విచారణ అనంతరం నివేదిక రూపొందిస్తారు. వధూవరులు వేర్వేరు జిల్లాలకు చెందిన వారైతే సంబంధిత జిల్లాల నుంచి ఎన్‌వోసీ తీసుకుంటారు. అవసరాన్ని బట్టి ఆయా జిల్లాల్లోనే దరఖాస్తు చేసుకొని ప్రోత్సాహకం పొందే అవకాశముంది. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను సీనియారిటీ ప్రకారం పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు. అర్హత ఉన్న జంటలకు విడతలవారీగా నిధులు విడుదల చేస్తూ ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించడం ద్వారా సామాజిక సమానత్వం, కుల వివక్ష నిర్మూలనకు ప్రభుత్వం ఊతమిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement