వేములవాడరూరల్: దాదాపు రెండున్నర నెలలుగా ఆస్పత్రిలో మృత్యువులో పోరాడుతున్న వేములవాడకు చెందిన మిట్ట ఓదయ్య చివరికి సోమవారం తుదిశ్వాస విడిచాడు. వివరాలు ఇలా ఉన్నాయి. వేములవాడలోని మిట్ట ఓదయ్య(53)కు సర్వేనంబర్ 590లో 1.31 ఎకరం భూమి ఉంది. అందులో నుంచి రైల్వే పట్టాలు పోతున్నాయి. వ్యవసాయమే ఆధారంగా బతుకుతున్న ఓదయ్య భూమికి మార్కెట్‌లో రూ.2కోట్లు పలుకుతుంది. కానీ ప్రభుత్వం రూ.73 లక్షలు చెల్లించింది. తక్కువ పరిహారం వచ్చిందన్న మనోవేదనకు గురయ్యాడు. గత జూన్ 5వ తేదీన తన ఇంటి వద్ద ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు కరీంనగర్‌కు తరలించి 72 రోజులపాటు చికిత్స అందించారు. ఓదయ్యను బతికించుకునేందుకు ప్రభుత్వం నుంచి వచ్చిన పరిహారం డబ్బులతోపాటు అదనంగా అప్పు చేయాల్సి వచ్చింది. ఇప్పటికై నా ప్రభుత్వం, జిల్లా అధికారులు స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.


