జమ్మికుంట(హుజూరాబాద్): జమ్మికుంట పట్టణంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన గుల్ల సంపత్ (51) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రామగుండం రైల్వే పోలీసు హెడ్ కానిస్టేబుల్ గంగారపు తిరుపతి తెలిపిన వివరాలు.. సంపత్ కారు నడుపుకొని జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి భార్య ఫిర్యాదు చేశారు. కాగా, కుటుంబంలో భూ సమస్యలతో మోసం చేశారని, వారు ఇబ్బందులు పెడుతున్నారని వాట్సప్‌లో సూసైడ్ నోటు మెస్సెజ్ ఉంది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టనున్నట్లు రామగుండం రైల్వే హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు.
పరిహారానికి నోచుకోకుండానే కార్మికుడి మృతి
రామగుండం: పెద్దపల్లి జిల్లా అంతర్గాం స్పిన్నింగ్ మిల్లు కార్మికుడు మహ్మద్ నసీరొద్దీన్(71) వయోభారంతో సోమవారం మృతి చెందాడు. ఇతడికి రావాల్సిన వేతన బకాయిలు, ఇళ్లస్థలం ఇతరత్రా ప్రయోజనాలు అందకుండానే మృతి చెందడంపై బర్మా, కాందీశీకుల సంక్షేమ సంఘం ప్రతినిధి ఇండిబిల్లి రవీందర్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తక్షణమే టెక్స్‌టైల్ మిల్లు కార్మికులకు రావాల్సిన బకాయిలు, ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు.
పోలీసులకు అనుమానాస్పద వ్యక్తుల అప్పగింత
కథలాపూర్: మండలంలోని భూషణరావుపేటలో సోమవారం మధ్యాహ్నం అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురిని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన నలుగురు వ్యక్తులు వింత వేషధారణలో కారులో భూషణరావుపేట వచ్చారు. పలు దుకాణాల్లోకి వెళ్లి భిక్షాటనకు వచ్చామని చెప్పి యజమానులపై పొగ పెట్టడంతో మత్తు మందు కావచ్చనే అనుమానంతో వారంతా కేకలు వేశారు. గ్రామస్తులు గుమిగూడి కారును అడ్డగించి వారిని నిలదీశారు. పొంతనలేని సమాధానం చెప్పడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. నలుగురిని తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్సై రవికిరణ్ పేర్కొన్నారు.
బైక్‌పై నుంచి పడి ఒకరికి గాయాలు
కొడిమ్యాల: ద్విచక్రవాహనం అదుపు తప్పి కింద పడడంతో ఓ వ్యక్తి గాయపడిన ఘటన మండలంలోని దమ్మయపేట వద్ద సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం మండలకేంద్రానికి చెందిన రమేశ్ తన ద్విచక్రవాహనంపై గోవిందారం వెళ్లాడు. అక్కడ కోడిగుడ్లు విక్రయించి తిరిగి ఇంటికి వస్తుండగా వాహనం అదుపుతప్పి కింద పడ్డాడు. తలకు గాయమై స్పృహ తప్పి పడిపోయాడు. స్థానికులు అంబులెన్స్‌కు ఫోన్ చేసి చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమయానికి ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈతపోటీల్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారుల ప్రతిభ
గోదావరిఖనిటౌన్: హైదరాబాద్ అంబర్‌పేట జీహెచ్‌ఎంసీ స్విమ్మింగ్ పూల్‌లో ఇటీవల జరిగిన తెలంగాణ మాస్టర్స్ రాష్ట్రస్థాయి ఈతపోటీల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ స్విమ్మర్స్ పలు పతకాలు సాధించారు. ఆర్.ప్రశాంత్, గోల్డ్‌మెడల్, ఎం.శ్రీధర్ గోల్డ్, సిల్వర్, ఆర్.రామారావు, గోల్డ్, 2 కాంస్య, ఎ.రమేశ్‌కుమార్, గోల్డ్, మంగ వెంకటేశ్వర్లు కాంస్య, ఎం.శ్రీధర్ కాంస్య, బంగారి రాజయ్య సిల్వర్, కాంస్య పతకాలు సాధించినట్టు తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి తెలిపారు. ప్రతిభ చూపిన స్విమ్మర్స్ హరియాణాలో సెప్టెంబర్‌లో జరిగే జాతీయస్థాయి ఈతపోటీల్లో పాల్గొంటారని ఆయన వివరించారు.


