జగిత్యాల: మున్సిపాలిటీల్లో ఔట్‌సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్న డ్రైవర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ల వేతనాలను తగ్గిస్తూ జీవో జారీ అయిన విషయం తెల్సిందే. రూ.6వేలకు పైగా వేతనాలు తగ్గడంతో వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాలలో రమేశ్ అనే ఔట్‌సోర్సింగ్ కార్మికుడు సోమవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగాడు. మంగళవారం హైదరాబాద్‌లో కార్మికులకు సంబంధించిన సమావేశం ఉండటంతో సుమారు 50మంది వెళ్తామని మున్సిపల్ ఉన్నతాధికారులను అడిగితే కొంత మందికే పర్మిషన్ ఇచ్చారని, అందరికీ ఇవ్వాలంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చుట్టూ ఉన్న వారు గమనించి వెంటనే కార్యాలయానికి తరలించారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్‌ను వివరణ కోరగా.. పర్మిషన్ ఏమీ లేదని, 50 మంది కాకుండా కొంతమంది వెళ్లాలని చెప్పామని తెలిపారు.
న్యాయం చేయాలంటూ తల్లీకూతుళ్లు..
బెజ్జంకి (సిద్దిపేట): న్యాయం చేయాలంటూ తల్లి, ఇద్దరు కుమార్తెలు బెజ్జంకి తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తికి చెందిన అందె లక్ష్మి, ఆమె కూతుళ్లు శృతి, శైలులను రెవెన్యూ, పోలీస్ సిబ్బంది సకాలంలో అడ్డుకుని వారించారు. బెజ్జంకిలోని తల్లిగారికి చెందిన 38 గుంటల భూమిని తమకు ఇవ్వకుండా సోదరి కుమారుడు అక్రమంగా విక్రయిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టును ఆశ్రయించినా వివాదంలో ఉన్న భూమిని తహసీల్దార్ ఎలా రిజిస్ట్రేషన్ చేస్తున్నారని మండిపడ్డారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు.


