తల్లి జన్మదినం రోజే కొడుకు దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

తల్లి జన్మదినం రోజే కొడుకు దుర్మరణం

Aug 18 2026 12:39 AM | Updated on Aug 18 2026 12:39 AM

రాత్రి బర్త్‌డే కేక్‌ కట్‌ తెద్దామని చెప్పి బయటకు..

ఇంటికి తిరిగొస్తుండగా కబళించిన రోడ్డు ప్రమాదం

మరో ఇద్దరికీ తీవ్రగాయాలు.. కోరుట్లలో విషాదం

కోరుట్ల: ‘అమ్మా హ్యాపీ బర్త్‌డే. రాత్రికి బర్త్‌డే కేక్‌ కట్‌ చేద్దాం..’ అని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరైంది. ‘నా పుట్టిన రోజు నీ చావు రోజైంది..కొడుకా..’ అని ఆ తల్లి విలపించిన తీరు అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది. కోరుట్లలోని ప్రకాశంరోడ్‌కు చెందిన గంగాదేవి శ్రీనివాస్‌, వనిత దంపతులకు ఇద్దరు కుమారులు. వనిత బల్దియా 13వ వార్డు ఆర్‌పీగా పనిచేస్తోంది. పెద్ద కొడుకు రాహుల్‌(17) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం వనిత పుట్టినరోజు కావడంతో తల్లికి బర్త్‌డే శుభాకాంక్షలు చెప్పాడు. సాయంత్రం కేక్‌ కట్‌ చేద్దామని చెప్పి మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. రాత్రి 11 గంటల వరకు స్నేహితులతోనే ఉన్నాడు. తల్లి నుంచి పలుమార్లు ఫోన్లు వస్తుండటంతో స్నేహితులు దుంపేట వర్షిత్‌, సల్లం శ్రీశాంత్‌తో కలిసి ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరాడు. పట్టణంలోని ఎరుకలవాడ కల్వర్టు వద్దకు చేరుకోగానే అదుపుతప్పి జాతీయ రహదారి డివైడర్‌ను ఢీకొట్టారు. దీంతో ముగ్గురూ ఎగిరి రోడ్డుపై పడిపోయారు. రాహుల్‌ తలకు తీవ్రగాయాలై అక్కడిక్కడే మృతిచెందాడు. వర్షిత్‌, శ్రీశాంత్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. రాహుల్‌ మృతితో స్థానికంగా విషాదం నెలకొంది. కాంగ్రెస్‌ నాయకుడు జువ్వాడి కృష్ణారావు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రాహుల్‌ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్యాంరాజ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement