సీఐకి ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌ | - | Sakshi
Sakshi News home page

సీఐకి ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌

Aug 16 2026 12:33 AM | Updated on Aug 16 2026 12:33 AM

కరీంనగర్‌రూరల్‌: కరీంనగర్‌రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ సీఐ అనుముల నిరంజన్‌రెడ్డి పోలీస్‌సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌ ప్రకటించగా శనివారం స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. అసాంఘిక శక్తుల అణచివేత, మావోయిస్టుల ఏరివేతలో అత్యున్నత సేవలందించి ప్రస్తుతం కరీంనగర్‌రూరల్‌ సీఐగా విధులు నిర్వర్తిస్తున్న నిరంజన్‌రెడ్డి 2025 సంవత్సరం ఐపీఎం అవార్డుకు ఎంపికయ్యారు.

కానిస్టేబుల్‌ నుంచి సీఐ వరకు..

1989లో కానిస్టేబుల్‌గా ఎంపికై న నిరంజన్‌రెడ్డి పోలీస్‌ శిక్షణ అనంతరం 1990లో జగిత్యాల రూరల్‌పోలీస్‌స్టేషన్‌లో తొలిపోస్టింగ్‌ పొందారు. నక్సలైట్ల ఏరివేత కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ పలు ఎదురుకాల్పుల్లో విధులు నిర్వహించారు. నిరంజన్‌రెడ్డి సేవలను గుర్తించిన అప్పటి కరీంనగర్‌ జిల్లా ఎస్పీ రత్నారెడ్డి తక్కువ సర్వీస్‌లోనే హెడ్‌కానిస్టేబుల్‌గా పదోన్నతి కల్పించారు. 1992లో స్వగ్రామం వరంగల్‌ జిల్లాకు వెళ్తున్న క్రమంలో మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో నిరంజన్‌రెడ్డితోపాటు మరో కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. ధైర్యంగా మావోయిస్టులపై ఎదురుకాల్పులు జరిపి ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన ధైర్యసాహసాలు, విశిష్టసేవలను అప్పటి ప్రభుత్వం గుర్తించి ముఖ్యమంత్రి సేవాపతకం, ముఖ్యమంత్రి ఉత్తమ సేవాపతకంతో సత్కరించింది. అనంతరం 1994లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సిరిసిల్లలోని వీర్నపల్లిలో సీఆర్‌పీఎఫ్‌ పోలీస్‌క్యాంప్‌ గైడ్‌గా నిరంజన్‌రెడ్డి వ్యవహరించారు. నక్సలైట్ల నుంచి బాంబులు, ఆయుధాలను స్వాధీనం చేసుకుని ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కీలకంగా పనిచేశారు. 1994 సంవత్సరం తర్వాత ఎస్సైగా, 2023లో సీఐగా ప్రమోషన్‌ పొందారు. ఎస్సైగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పలు పోలీస్‌స్టేషన్లలో పనిచేసిన ఆయన సీఐగా విజిలెన్స్‌, ఇంటెలిజెన్స్‌తోపాటు మెట్‌పల్లిలో సేవలందించారు. సామాజిక సేవా కార్యక్రమాలను విరివిగా చేపట్టారు. ప్రస్తుతం కరీంనగర్‌రూరల్‌ సీఐగా పనిచేస్తున్న నిరంజన్‌రెడ్డి డ్రగ్స్‌ నిర్మూలన, ఇసుక అక్రమరవాణా నియంత్రణ, సైబర్‌క్రైంపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌ రావడంలో ప్రజలు అందించిన సహకారం, ఉన్నతాధికారులు తన సేవలను గుర్తించి సిఫారసు చేయడం ఎంతో ముఖ్యమైనవన్నారు. ఇప్పటివరకు 82 క్యాష్‌ రివార్డులు, 64 జీఎస్సీలు, 24 ప్రశంసాపత్రాలు అందుకున్నట్లు తెలిపారు.

సీఎం చేతుల మీదుగా స్వీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement