ఇల్లంతకుంట: మండలంలోని వంతడుపుల గ్రామానికి చెందిన చింతకింది భూమయ్య (60) అనారోగ్యంతో జీవితంపై విరక్తి చెంది శుక్రవారం మధ్యాహ్నం గడ్డి మందుతాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో సిరిసిల్ల ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం వేకువజామున మృతిచెందాడు. మృతుడికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతుడి భార్య కూడా అనారోగ్యంతో మంచం పట్టింది. కొడుకు నరసయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు.
మద్యానికి బానిసై ఒకరు..
చొప్పదండి: తాగిన మైకంలో ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని కొలిమికుంటలో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చీకట్ల మహేశ్ (37)కు భార్య సరిత, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. మహేశ్ కొన్నేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. తరుచూ భార్యతో గొడవపడేవాడు. దీంతో సరిత ఇద్దరు పిల్ల లను హాస్టల్‌లో ఉంచి చదివిస్తోంది. శుక్రవారం రాత్రి మహేశ్ భార్యతో గొడవపడగా, అదే గ్రామంలోని తల్లిగారింటికి వెళ్లింది. దీంతో మనస్తాపం చెందిన మహేశ్ ఇంట్లో ఉరేసుకున్నాడు. ఉదయాన్నే భార్య వచ్చి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించడంతో మరిది అనిల్‌కు తెలుపగా ఇరుగుపొరుగుతో కలిసి ఉరి నుంచి కిందకు దించి పరిశీలించగా అప్పటికే మృతిచెంది ఉన్నాడు. మృతుడి సోదరుడు అనిల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేశ్‌రెడ్డి తెలిపారు.
ట్రాఫిక్ ఎస్సై చొరవ.. బాధితుడికి సకాలంలో వైద్యం
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్ వద్ద భార్యాభర్తల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ క్రమంలో భర్త నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భార్య ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా బాధితుడు సహకరించకుండా రోడ్డుపై గొడవ చేస్తుండగా, ట్రాఫిక్ ఎస్సై మల్లేశ్ గమనించారు. వెంటనే స్పందించిన ఎస్సై, బాధితుడిని తమ వాహనంలో ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు. ఎస్సై సకాలంలో స్పందించి బాధితుడిని ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పినట్లు తెలుస్తోంది.


