● జిల్లా యువజన క్రీడాశాఖ అధికారి శ్రీనివాస్‌గౌడ్
కరీంనగర్‌స్పోర్ట్స్: స్వామి వివేకానందుడిని యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని జిల్లా యువజన క్రీడాశాఖ అధికారి వి.శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా యువజన క్రీడాశాఖ ఆధ్వర్యంలో అంబేడ్కర్ స్టేడియంలో స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. స్వామి వివేకానందుని ఆదర్శాలను ఆశయాలను యువత మరవరాదన్నారు. యువత చేతిలోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని, యువత తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని అన్నారు. రాష్ట్ర ఉత్తమ యువజన అవార్డు గ్రహీత సత్తినేని శ్రీనివాస్, సుజాత, మల్లిక, సంపత్, జితేందర్, మహేశ్, పలు యువజన మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల సర్దుబాటు పూర్తి
కరీంనగర్‌టౌన్: జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ బుధవారం పూర్తిచేశారు. విద్యార్థులు అధికంగా ఉన్న పాఠశాలలకు 191 మంది ఉపాధ్యాయులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం సాయంత్రంలోగా కేటాయించిన పాఠశాలల్లో హాజరుకావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో సబ్జెక్టు టీచర్ల కొరత.. విద్యార్థులు లేని బడుల్లో ఉపాధ్యాయులు అధికంగా ఉండడం.. గురువులు ఉన్న పాఠశాలల్లో విద్యార్థులు లేకపోవడం వంటి సమస్యలు ఉన్న స్కూళ్ల జాబితాను సేకరించి ఈమేరకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. ఈ ప్రక్రియతో ఉపాధ్యాయుల కొరతకు పరిష్కారం లభించింది.
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలక సంస్థలో చేయూత పింఛన్ల పథకంలో భాగంగా కొత్త పింఛన్లకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. వృద్ధాప్య, బీడీ కార్మికుల దరఖాస్తులు మినహాయించి.. వితంతు, ఒంటరి మహిళ, వికలాంగులు, గీత, చేనేత, ఫైలేరియా, తలసేమియా, హీమోఫిలియా, సికల్‌సెల్ కేటగిరీల్లో దరఖాస్తులు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకోనివాళ్లు, డివిజన్లలోని వార్డు అధికారులకు, నగరపాలక సంస్థ పౌరసేవా కేంద్రంలోని ప్రత్యేక కౌంటర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
కరీంనగర్: నగరంలోని సరస్వతీ శిశుమందిర్ పాఠశాల ఆవరణలో మేయర్ కొలగాని శ్రీనివాస్ అరటి మొక్కలను నాటారు. మేయర్ మాట్లాడుతూ.. మొక్కలను నాటడం మాత్రమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా ప్రతీ ఒక్కరి బాధ్యతని అన్నారు. ఇంజనీర్ అన్నారెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు.
డ్రైనేజీ పనులు ప్రారంభం
కరీంనగర్ కార్పొరేషన్: డ్రైనేజీల నిర్మాణాలతో రోడ్లు, వీధుల్లో నీళ్లు నిలిచే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్నట్లు మేయర్ తెలిపారు. 26వ డివిజన్ ఆదర్శనగర్‌లో రూ.10లక్షలతో చేపట్టనున్న డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.


