కరీంనగర్‌టౌన్: తెలంగాణను ఎడారి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు కుట్రలు చేస్తున్నారని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కరీంనగర్‌లోని ఎమ్మెల్యే గంగుల నివాసంలోవిలేకరులతో మాట్లాడారు. ఈనెల 18న హైదరాబాద్‌లో నిర్వహించే గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు 18వ సమావేశ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను వెంటనే తొలగించాలని కోరారు. తెలంగాణ సాధనే నీళ్ల కోసం జరిగిన పోరాటమన్నారు. కేసీఆర్ హయాంలో చట్టబద్ధమైన అనుమతులతోనే ప్రాజెక్టులను నిర్మించినట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఏడు ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రానికి ఎజెండా పంపడంపై మండిపడ్డారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎలా స్పందిస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చిన అనుమతులను రద్దు చేయాలని కోరడం, దాన్ని ఎజెండాలో పెట్టడం సరికాదన్నారు. తెలంగాణకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్‌లో ఈ అంశంపై ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిర్మించిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని అడుగుతుంటే ఎంపీలు మౌనం వహించడం సిగ్గుచేటన్నారు. జీఆర్‌ఎంబీ ఎజెండా నుంచి ఆ ప్రాజెక్టుల తొలగింపునకు పార్లమెంట్ వేదికగా కొట్లాడాలని సూచించారు. ఈనెల 18వ తేదీలోగా ప్రాజెక్టులను జీఆర్‌ఎంబీ ఎజెండా నుంచి తొలగించకుంటే బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఏనుగు రవీందర్‌రెడ్డి, బోనాల శ్రీకాంత్, నాగి శేఖర్, గందె మాధవి పాల్గొన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు తీరు గర్హనీయం
కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు
పార్లమెంట్‌ను స్తంభింపజేయాలి
జీఆర్‌ఎంబీ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను తొలగించాలి
ఎమ్మెల్యే గంగుల, మాజీ ఎంపీ
వినోద్‌కుమార్ డిమాండ్


