కరీంనగర్‌రూరల్: కార్పోరేషన్ విలీన గ్రామాల్లో ప్రభుత్వస్థలాలను అక్రమార్కులు ఆక్రమిస్తున్నారు. ఆరెపల్లిలో ఓ వ్యక్తి రాత్రికి రాత్రే షెడ్డు నిర్మాణం చేపట్టడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. స్థానికులు ఫిర్యాదు చేయడంతో సోమవారం మున్సిపల్ అధికారులు కూల్చివేయగా కొందరు కార్పొరేటర్ భర్తను బెదిరించడం వివాదాస్పదంగా మారింది. ఆరెపల్లిలోని సర్వేనంబరు120 లోని ప్రభుత్వస్థలంలో గత బీఆర్‌ఎస్ హ యాంలో డబుల్‌బెడ్రూం ఇండ్లు నిర్మించారు. లబ్ధిదారులను ఎంపిక చేయకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయి. మిగిలిన ప్రభుత్వస్థలంలో ఓ వ్యక్తి మూడు రోజుల నుంచి షెడ్డు నిర్మాణం చేపట్టాడు. వరుసగా వచ్చిన మూడు సెలవు రోజులను సద్వినియోగం చేసుకుని, రాత్రివేళల్లో పనులు కొనసాగించా డు. ప్రశ్నించిన స్థానికులను ప్రభుత్వం తనకు పట్టా ఇచ్చిందని బెదిరింపులకు గురిచేయడంతో మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశా రు. సోమవారం మధ్యాహ్నం మున్సిపల్ అధికారులు షెడ్డు నిర్మాణాన్ని పరిశీలించారు. ప్రభుత్వం తనకు పట్టా ఇచ్చిందని సదరు వ్యక్తి అధికారులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. చివరకు ప్రభుత్వస్థలంలో అక్రమ నిర్మాణంగా గుర్తించి జేసీబీతో షెడ్డుగోడలను కూల్చివేయించారు. ఈ వ్యవహారంలో కొందరు ఆక్రమణదారుడికి మద్దతుగా 1వ డివిజన్ కార్పొరేటర్ బారి అపర్ణ భర్త జితేందర్‌ను బెదిరింపులకు గురిచేశారు. విలీన గ్రామాల్లో విలువైన ప్రభుత్వస్థలాలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
రాత్రికి రాత్రే షెడ్డు నిర్మాణం


