వేములవాడ: అక్రమ వసూళ్లు, బెదిరింపులకు గురిచేస్తే కేసులు నమోదు చేస్తామని రాజన్నసిరిసిల్ల ఎస్పీ మహేశ్ బీ గీతే హెచ్చరించారు. ఎవరైనా బెదిరింపులకు గురిచేస్తే వెంటనే 112కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. సోమవారం విలేకరులతో వివరాలు వెల్లడించారు. స్టోన్ క్రషర్ నిర్వాహకుడు నీలం గురువయ్య, రైస్‌మిల్ నిర్వాహకుడు బండ మల్లేశంయాదవ్‌లను బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన ఇద్దరిని సోమవారం రిమాండ్‌కు తరలించారు. కోనరావుపేట మండలం ఎగ్లాస్‌పూర్‌కు చెందిన దండు వినోద్‌కుమార్, నాంపల్లికి చెందిన పెద్దిగారి అమరగొండ అజయ్ కలిసి వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేయాలని ప్రణాళిక వేసుకున్నారు. ఇందులో భాగంగా అగ్రహారం శివారులో స్టోన్‌క్రషర్ నిర్వహిస్తున్న నీలం గురువయ్యకు ఈనెల 9న ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు. గురువయ్యను అగ్రహారం గుట్టల వద్దకు తీసుకెళ్లారు. వ్యాపారానికి సంబంధించి అసత్య ప్రచారాలు చేయకుండా ఉండాలంటే రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భయాందోళన చెందిన గురువయ్య ఏటీఎం నుంచి రూ.50వేలు డ్రా చేసి వారికి ఇచ్చాడు. అనంతరం వీరిద్దరు వేములవాడరూరల్ మాజీ ఎంపీపీ, బీజేపీ నాయకుడు బండ మల్లేశంను రైస్‌మిల్‌కు సంబంధించిన విషయంలో రూ.10లక్షలు డిమాండ్ చేశారు. వెంటనే మల్లేశం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితులని ఆదివారం రాత్రి సాయినగర్‌లో అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.50వేలు నగదు, రెండు మొబైల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఎవరైనా డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడితే వెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని, లేదా 112లో సమాచారం అందించాలని ఎస్పీ కోరారు.
డబ్బు వసూలుకు దిగిన ఇద్దరి అరెస్టు
ఎస్పీ మహేశ్ బీ గీతే


