ఉన్నట్లా.. లేనట్లా? | - | Sakshi
Sakshi News home page

ఉన్నట్లా.. లేనట్లా?

Aug 10 2026 1:16 AM | Updated on Aug 10 2026 1:16 AM

రెండేళ్లుగా విడుదల కాని సీడీఎఫ్‌ నిధులు ఎమ్మెల్యేల ప్రతిపాదనలతోనే సరి జనాభా ప్రాతిపదికన కేటాయిస్తేనే అభివృద్ధి

కరీంనగర్‌టౌన్‌: నియోజకవర్గ అభివృద్ధి ఫండ్‌(సీడీఎఫ్‌) ఉన్నట్లా.. లేనట్లా.. అనే సందిగ్ధం నెలకొంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా నిధులు విడుదల కాకపోవడంతో ఎమ్మెల్యేలు ప్రజలకిచ్చిన హమీలు అమలు చేయలేకపోతున్నారు. జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. కరీంనగర్‌, హుజూరాబాద్‌ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్‌, పాడి కౌశిక్‌రెడ్డిలు ప్రాతినిథ్యం వహిస్తుండగా.. చొప్పదండి, మానకొండూర్‌ నుంచి మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణలు ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో రూ.5కోట్ల చొప్పున మంజూరు చేయగా.. రెండేళ్లుగా ఎలాంటి నిధులు రాకపోవడంతో మంత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇన్‌చార్జి మంత్రుల ద్వారా ఇతర నిధులు పొందుతూ అభివృద్ధిలో భాగస్వాములు అవుతుండగా.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో పరిస్థితి దారుణంగా తయారైంది. అక్కడ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీల పేరిట ఇతర నిధులు విడుదల చేస్తుండటంతో వివాదాస్పదం అవుతోంది.

ఏటా పెరుగుతున్న సీడీఎఫ్‌ నిధులు

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం కేటాయిస్తున్న నియోజకవర్గ అభివృద్ధి ఫండ్‌ (సీడీఎఫ్‌) ఏటా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటోంది. సీడీఎఫ్‌ నిధులు మంజూరు 2010 నుంచి ప్రారంభమైంది. మొదట్లో రూ.కోటి ఉండగా తర్వాత రూ.3 కోట్లకు పెంచారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రూ.10 కోట్లు కేటాయించేలా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పడగానే అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.5 కోట్ల చొప్పున మంజూరయ్యాయి. నిధులు సకాలంలో విడుదల చేయకపోవడంతో గ్రామాలు, పట్టణాల్లో అంతర్గత రోడ్లు అధ్వానంగా తయారవుతున్నాయి. మరిన్ని నిధులు మంజూరైతే ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వచ్చే అర్జీలు పరిష్కారమయ్యే అవకాశం ఉండేది.

సకాలంలో నిధులు వస్తేనే ఊరట

నియోజకవర్గ అభివృద్ధి నిధులు సకాలంలో మంజూరైతేనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఊరట కలుగనుంది. గ్రామాలు, పట్టణాల్లో బోర్లు వేయించడం, స్కూళ్లలో అదనపు తరగతి గది, టాయిలెట్ల నిర్మాణం, సీసీ రోడ్ల పనులు చేపట్టవచ్చు. విద్యుత్‌ స్తంభాల ఏర్పాటు, ఎలక్ట్రిక్‌ దహనవాటిక, ట్రాన్స్‌ఫార్మర్లు, వీధి దీపాల ఏర్పాటు, ఆరోగ్య ఉపకేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, చెక్‌డ్యామ్‌లు, కాలువలు, కమ్యూనిటి హాళ్లు, బస్లాండ్ల నిర్మాణం వంటి 98 రకాల అభివృద్ధి పనులకు ఖర్చు చేయవచ్చు.ఈ నిధుల ఖర్చుకు సంబంధిత జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆమోదం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో కలెక్టర్‌ ఆమోదంతో నిధుల మంజూరు జరిగేది. ఈసారి కలెక్టర్‌తో పాటు ఇన్‌చార్జీ మంత్రి ఆమోదాన్ని తప్పనిసరి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement