అర్ధవార్షికంలో కరీంనగర్ పోలీసుల పనితనం భేష్ పెండింగ్ కేసుల తగ్గుదలలో రూరల్ డివిజన్ ముందంజ స్టేషన్లవారీగా మొదటి వరుసలో కరీంనగర్ వన్‌టౌన్
కరీంనగర్‌క్రైౖం: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2026 జనవరి నుంచి జూన్ వరకు నమోదైన నేరాల గణాంకాలు ఆసక్తికర చిత్రాన్ని ఆవిష్కరించాయి. పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు పెరగగా.. పెండింగ్ కేసులు తగ్గడం పోలీసుల దర్యాప్తు సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోంది. 2025 తొలి ఆరు నెలల్లో కమిషనరేట్ వ్యాప్తంగా 3,654 కేసులు నమోదు కాగా, 2026లో అదే కాలంలో 3,806కేసులు నమోదయ్యాయి. అంటే 152 కేసులు ఎక్కువ నమోదు కాగా.. దర్యాప్తులో ఉన్న కేసులు 3,186 నుంచి 3,102కు తగ్గి 84 కేసుల తగ్గుదల నమోదు కావడం గమనార్హం.
దర్యాప్తులో రూరల్ డివిజన్ టాప్
కేసులో దర్యాప్తులో కరీంనగర్ రూరల్ డివిజన్ టాప్‌లో నిలిచింది. 2025లో జూన్ వరకు 1,626 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 1,725 ఫిర్యాదులు వచ్చాయి. గతేడాది పెండింగ్ కేసులు ఉండగా.. 1,541.. ఈ సారి 1,325కు తగ్గాయి. మొత్తంగా 216 కేసుల తగ్గుదల నమోదైంది. కరీంనగర్ టౌన్ డివిజన్‌లో గతేడాది జూన్ వరకు 1,091 కేసులు నమోదు కాగా.. ఈఏడాది 1,103కి పెరిగాయి. దర్యాప్తు పెండింగ్ కేసులు గతేడాది 1,077 ఉండగా.. ఈ ఏడాది 1,091కి పెరిగాయి. ఇందుకు కారణం నగరంలో నేరాల ఒత్తిడి, విచారణ భారంగా పోలీసులు భావిస్తున్నారు. హుజూరాబాద్ డివిజన్‌లో రిపోర్టింగ్ కేసులు 937 నుంచి 978కు పెరిగాయి. దర్యాప్తులో ఉన్న కేసుల సంఖ్య 568 నుంచి 686కు పెరిగి ఏకంగా 118 కేసుల పెరుగుదల నమోదైంది.
పోలీసు స్టేషన్ వారీగా..
గతేడాది మొదటి ఆరు నెలలు, ఈ ఏడాది జూన్ వరకు దర్యాప్తులో ఉన్న కేసులు, అత్యధికంగా తగ్గిన స్టేషన్లను పరిశీలిస్తే.. కరీంనగర్ వన్‌టౌన్ 117, కరీంనగర్ రూరల్ 101, మాననకొండూరు 84, చొప్పదండి 60, ఎల్‌ఎండీకాలనీ 26 కేసులు తగ్గాయి. ఈ స్టేషన్లలో పాత కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. దర్యాప్తులో ఉన్న కేసులు భారీగా పెరిగిన స్టేషన్లు పరిశీలించగా.. కొత్తపల్లి 80, ఉమెన్ పోలీస్‌స్టేషన్ 58, కరీంనగర్ 3 టౌన్ 41, జమ్మికుంట 41, కరీంనగర్ 2 టౌన్ 32, సైదాపూర్ 31, హుజూరాబాద్ టౌన్ 28, ఇల్లందకుంటలో 24 కేసులు పెరిగాయి. ఈ ఆరు మాసాల్లో కరీంనగర్ 1టౌన్‌లో 403, కొత్తపల్లి 405, కరీంనగర్ 2టౌన్ 373, జమ్మికుంట 264, మనకొండూరు 244 కేసులు పెరిగాయి. హుజూరాబాద్ డివిజన్, కొత్తపల్లి, ఉమెన్ పోలీస్‌స్టేషన్, 2 టౌన్, 3 టౌన్, జమ్మికుంట వంటి ప్రాంతాల్లో పెరుగుతున్న దర్యాప్తు పెండింగ్ కేసులు భవిష్యత్తులో ప్రత్యేక కార్యాచరణ అవసరాన్ని సూచిస్తున్నాయి.


