బాలింతలకు అందని పోషకాహారం జనరల్ ఆస్పత్రిలోనూ అదే పరిస్థితి మెనూ పాటించని క్యాంటీన్ నిర్వాహకులు ఆస్పత్రి భోజన కాంట్రాక్టర్ కాసుల కక్కుర్తి
కరీంనగర్: కరీంనగర్ మాతా శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్)లో బాలింతలు, గర్భిణులకు పోషకాహారం అందని ద్రాక్షగా మారుతోంది. నాసిరకమైన ఆహారం వడ్డిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఎంసీహెచ్, జీజీహెచ్, క్రిటికల్ కేర్‌లో కలుపుకొని సుమారు 550 పడకలున్నాయి. ఇన్ పేషెంట్లకు ప్రతిరోజు భోజనం పెట్టాల్సిన డైట్ కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పేషెంట్లు, గర్భిణులు, బాలింతలు అర్ధాకలితో అలమటించాల్సి వస్తోంది. రుచి పచీ లేని భోజనం తినలేక ఇంటినుండే టిఫిన్ బాక్సులు తెచ్చుకుంటున్నారు.
ప్రోటీన్లకు కత్తెర.. లాభాలే లక్ష్యం
శస్త్రచికిత్సలు చేయించుకున్న మహిళలకు, పాలు ఇవ్వాల్సిన బాలింతలకు హైప్రోటీన్ ఆహారం అత్యంత అవసరం. ప్రభుత్వం ప్రతీ పూట ఇద్దరు వ్యక్తులకు సరిపడా బలాన్నిచ్చే తిండితో పాటు రెండు గుడ్లు, పల్లిపట్టీలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినా, సగానికి కోత పెడుతున్నారు. వార్డుకో న్యాయం, మనిషికో తీరుగా వ్యవహరిస్తూ గుడ్డును పక్కదారి పట్టిస్తున్నారు. పాలు నీళ్లకన్నా పలుచగా, పప్పు నీళ్ల రసంగా మారిపోయాయి. ఇక టిఫిన్ అంటే రోజు ఉప్మా తప్ప వేరే కనబడదు. నాణ్యత లేని ముతక బియ్యం వండటంతో ఆ అన్నం మింగలేక, గొంతు దిగక ఆకలితో అల్లలాడుతున్నారు.
ఆసుపత్రి భోజనం ఇలాగేనా
క్యాంటీన్ నిర్వాహకులు శుభ్రతను మర్చిపోయారు. రుచి లేని వంటకాలతో కనీస పోషకాలు దక్కక రోగుల్లో రోగనిరోధక శక్తి సన్నగిల్లుతోంది. ఆసుపత్రి బయట దాతలు చేసే అన్నదానంలో ఉన్న శుచి కూడా ఈ సర్కారు బువ్వలో కనిపించడం లేదని రోగుల బంధువులు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు.
పర్యవేక్షణ కరువు
పర్యవేక్షించాల్సిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నా యి. ఆస్పత్రి ప్రాంగణంలో ఏ రోజు ఏం పెడతారో తెలిపే ‘మెనూ బోర్డు’ కూడా ప్రదర్శించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. అధికారు లు స్పందించి ప్రతిరోజూ ఆహార నాణ్యతను తనిఖీ చేసి, నాసిరకం వంటలు వడ్డిస్తున్న కాంట్రాక్టర్ల లైసెన్సులు రద్దు చేయాలని ప్రజలు కోరుతున్నారు.


