సిరిసిల్లటౌన్: వారిది నిరుపేద కుటుంబం. రెక్కాడితేనే డొక్కాడే పరిస్థితులు. ఆ కుటుంబపెద్ద వెంగళ వెంకటేశం అనుమానాస్పద స్థితిలో మృతిచెందడంతో.. భార్య, కూతురు రోడ్డున పడ్డారు. అంత్యక్రియలు చేసేందుకు సైతం డబ్బులు లేకపోవడంతో విరాళాలు సేకరించారు. గురువారం మిస్సయిన ఇంటి పెద్ద కోసం భార్య, కూతురు ఏడ్చి..ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయాయి. శనివారం మృతిచెంది కనిపించడంతో వారి రోదనకు అంతులేకుండా పోయింది. వారి దీనస్థితిని చూసి స్థానికులు చలించిపోతున్నారు. సిరిసిల్ల పట్టణంలో వైపని కార్మికుడు వెంకటేశం మృతితో భార్య సులోచన, కూతురు ప్రసన్న ఒంటరిగువ్వలయ్యారు. ఆవేదన వారి మాటల్లోనే..
బిడ్డ లేకుండా ఏ గుడికీ పోడు
ఐదు రోజుల కింద మా ఆయన పనిచేసే కుసుమ గణేష్‌తో పోయిండు. అప్పటి నుంచి ఇంటికి రాలేదు. అదేరోజు మా బిడ్డ ఫోన్ చేసి అడిగితే చెప్పలేదు. గుడికి కొబ్బరికాయలు కొట్టపోయిండని చెబుతుండు. వారం కిందే మా బిడ్డతో కలిసి ముగ్గురం పోయి అదే గుడిలో కొబ్బరికాయలు కొట్టి వచ్చినం. మళ్లీ అదే గుడికి గణేష్‌తో ఎందుకు పోయిండు..? ఆ విషయం ఆయన ఎందుకు దాసిపెట్టిండు..? మాకు అనుమానంగానే ఉంది. మున్సిపల్ వైస్‌చైర్మన్ సందీప్‌తో గొడవైనప్పటి నుంచి గణేశ్ పని ఇచ్చుడు బంద్ చేసిండు. మా ఆయన కనిపించకుండా పోయినసంది ఇంటి చుట్టూ కొత్త మనుషులు తిరుగుతుండ్రు. ఆయన చనిపోయిన చోట డబ్బాలున్నాయి. శరీరంపై గాయాలున్నాయి. ఆయనను చిత్రహింసలు పెట్టి సంపిండ్రు.
రాత్రి వేళ అంత్యక్రియలు
వెంకటేశం కుటుంబాన్ని శనివారం రాత్రి కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ ఆడెపు చంద్రకళ, జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, అధికార ప్రతినిధి వైద్య శివప్రసాద్ పరామర్శించారు. ప్రభుత్వం ఆదుకోవాలని వామపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. ప్రధాన పార్టీల ముఖ్య నేతల నుంచి స్పందన సరిగ్గా లేదన్న విషయం కూడా రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది. కాంగ్రెస్ నేతలు యెల్లె లక్ష్మీనారాయణ, చొప్పదండి ప్రకాశ్, మార్గం లక్ష్మణ్, బీజేపీ నాయకుడు దుమాల శ్రీకాంత్ రూ.5వేలు చొప్పున సాయం అందించారు. న్యాయం జరగాలన్న డిమాండ్‌తో వివిధ పార్టీల నేతలు ఆందోళనకు ప్రయత్నించగా ఆర్డీవో శ్రీధర్‌బాబు, టౌన్ సీఐ శ్రీనివాస్ వారించి పంపించారు. పొద్దంతా రాజకీయ నాయకుల పరామర్శలతో రద్దీగా మారిన వెంకటేశం ఇల్లు.. అంత్యక్రియల సమయంలో ఎవరూ లేకపోవడం చర్చనీయాంశమైంది. రాత్రి 10.30 గంటలకు అంత్యక్రియలు నిర్వహించగా.. తండ్రి చితికి కూతురు ప్రసన్న నిప్పుపెట్టారు.
పోలీసుల విచారణ
వెంకటేశం మృతి రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు. వెంకటేశం హత్యపై సామాజిక మాధ్యమాల్లో రాజకీయంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకుని లోతుగా విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే ఇద్దరు వ్యక్తులను విచారణ చేపట్టినట్లు సమాచారం. పోస్టుమార్టం రిపోర్టుతో వెంకటేశం మరణంపై స్పష్టత వస్తుంది.
కుటుంబ పెద్ద మృతితో అంతులేని విషాదం
రాత్రికి రాత్రే అంత్యక్రియలు
రోడ్డునపడిన తల్లీకూతురు


