బోయినపల్లి(చొప్పదండి): దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమర సైనికుడి కుటుంబం ప్రభుత్వ హామీల అమలు కోసం ఎదురుచూస్తోంది. దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్‌కు చెందిన పబ్బాల్ల అనిల్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన హామీలు ఇప్పటి అమలు కాలేదు. మూడేళ్లుగా ఎక్స్‌గ్రేషియా కోసం సైనికుడి భార్య అధికారుల చుట్టూ తిరుగుతోంది. అధికారులు జీవోల పేరుతో కాలయాపన చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ వ్యాఖ్యానించడం వైరల్‌గా మారింది. మల్కాపూర్‌కు చెందిన పబ్బాల లక్ష్మి –మల్లయ్యల కుమారుడు అని పదిహేనేళ్ల క్రితం ఆర్మీలో చేరాడు. జమ్మూకాశ్మీర్‌లో విధి నిర్వహణలో ఉండగా 2023 మే 4న హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడయ్యాడు. అనిల్‌కు భార్య సౌజన్య, కొడుకులు అయాన్, అరయ్. అనిల్ మరణాన్ని యుద్ధ సమయంలో ప్రాణనష్టంగా ప్రభుత్వం గుర్తించిందని ఆయన సతీమణి సౌజన్య పేర్కొంది.
ఎదురుచూపులే..
ఎక్స్‌గ్రేషియా, సేన మెడల్‌కు సంబంధించిన నగదు పురస్కారం మూడేళ్లుగా అందలేదని అనిల్ కుటుంబ సభ్యులు తెలిపారు. వ్యవసాయ భూమి, జిల్లా కేంద్రంలో ఇంటి స్థలం విషయంలోనూ తుది పరిష్కారం లభించలేదన్నారు. పలుమార్లు అధికారులను కలిసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనిల్ భార్య ఇద్దరు పిల్లలను చూసుకుంటూ మల్కాపూర్‌లోనే నివసిస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆమె కోరుతోంది. పిల్లల భవిష్యత్ దృష్ట్యా ఎక్స్‌గ్రేషియా, సేన మెడల్ నగదు పురస్కారం, వ్యవసాయ భూమి, ఇంటి స్థలం అందించాలని కోరుతుంది.
మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ వ్యాఖ్యలు వైరల్
దేశం కోసం ప్రాణాలు అర్పించి అమరుడైన అనిల్ సతీమణి సౌజన్య ఎక్స్‌గ్రేషియా కోసం మూడేళ్లుగా ఎదురుచూస్తోందని ఈ విషయంలో అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయమని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేస్తానని చెపుతున్నారు. ఆయన మాటలు సైతం అధికారులు వింటున్నారో.. లేదోనని పేర్కొన్నారు. అనిల్ అమరుడైన సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు శ్రద్ధాంజలి ఘటించి దేశభక్తిని ప్రకటించారు. అమరుడైన సైనిక కుటుంబానికి సాయం చేయాలని మెసేజ్ చేస్తే పట్టించుకోకపోవడం శోచనీయమని పేర్కొన్నారు.
వ్యవసాయభూమి, ఇంటి స్థలం కోసం ఎదురుచూపు
జమ్మూకాశ్మీర్‌లో అమరుడైన సైనికుడు అనిల్
జీవోల పేరుతో కాలయాపన చేస్తున్న అధికారులు


