కరీంనగర్‌టౌన్: పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా(పీఎంశ్రీ) పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఐదేళ్ల పాటు ఈ పథకాన్ని కొనసాగిస్తూ విడతల వారీగా వసతుల కల్పనకు రూ.కోటి వరకు నిధులు వెచ్చించనున్నారు. పాఠశాలల అభివద్ధికి ఈ పథకాన్ని 2022–23 నుంచి 2026–27 వరకు ఐదేళ్ల పాటు కొనసాగించేందుకు నిర్ణయించారు. ఉమ్మడి జిల్లాలో పీఎంశ్రీ కింద 60 పాఠశాలలను ఎంపిక చేశారు. తాజాగా ఉన్నత తరగతుల విద్యార్థులుకు ప్రయోగాత్మక బోధన చేపట్టి సైన్స్, గణితం పాఠ్యంశాలపై పట్టు సాధించి సామర్థాన్ని పెంచేందుకు సైన్స్ కిట్లు అందజేసేందుకు ఉమ్మడి జిల్లాకు రూ.24లక్షలు మంజూరు చేస్తూ రాష్ట్ర సమగ్ర శిక్ష ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి పాఠశాలలలో గణిత, సైన్స్ టీచర్లు, సీనియర్ ఉఫాధ్యాయులు, పాఠశాల కమిటీ ప్రతినిధితో ప్రధానోపాధ్యాయుడు అధ్యక్షుడిగా పాఠశాలస్థాయి ప్రొక్యూర్‌మెంట్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
విద్యార్థుల్లో నైపుణ్యమే లక్ష్యంగా పీఎంశ్రీ పాఠశాలలు..
పీఎంశ్రీ పాఠశాలల్లో అన్ని రకాల వసతులు కల్పించి ఇతర పాఠశాలలకు ఆదర్శంగా నిలిచేలా తీర్చిదిద్దుతారు. విద్యార్థులకు కార్పొరేట్‌స్థాయిలో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు ఆధునిక సాంకేతిక వనరులు సమకూర్చుతారు. విద్యార్థులకు మానసిక స్వేచ్ఛను కల్పించి వివిధ అంశాలపై కౌన్సెలింగ్ ఇస్తారు. దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాల అమలుకు ప్రాధాన్యత ఇస్తారు. విద్యార్థులు నేర్చుకున్న అంశాలను ఎప్పటికప్పుడు మూల్యాంకన చేసి విద్యార్థుల స్థాయిని పరిశీలిస్తారు. తద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడం సులభతరమవుతుంది.
ఉమ్మడి జిల్లాలో 60 స్కూళ్లకు రూ.24 లక్షలు విడుదల
నిధుల విడుదల ఇలా..
జిల్లా పాఠశాలలు నిధులు(రూ.లల్లో)
కరీంనగర్ 20 8,00,000
పెద్దపల్లి 13 5,20,000
రాజన్నసిరిసిల్ల 11 4,40,000
జగిత్యాల 16 6,40,000
మొత్తం 60 24,00,000


