కరీంనగర్‌క్రైం/కరీంనగర్: ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడి చేసి బంగారం ఎత్తుకెళ్లిన కిసాన్‌నగర్‌కు చెందిన మునుగొండ మధుకర్ అలియాస్ మధు(42)ను కరీంనగర్ త్రీటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వివరాల ప్రకారం.. శివాజీనగర్‌లో నివాసముండే జంగం రాజమ్మ ఒంటరిగా ఉండడం గమనించి ఇంట్లోకి 7వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో మధుకర్ ముఖానికి మాస్క్ ధరించి ప్రవేశించాడు. మెడలోని బంగారు గొలుసు, ఎడమ చెవి కమ్మను బలవంతంగా లాక్కున్నాడు. బాధితురాలు ప్రతిఘటించడంతో తలను గోడకేసి కొట్టడంతో గాయపడింది. నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. దోచుకున్న బంగారాన్ని బజాజ్ ఫైనాన్స్‌లో గోల్డ్‌లోన్ కింద తాకట్టు పెట్టి రూ.2.25 లక్షలు తన బ్యాంకు ఖాతాలో జమ చేసుకున్నాడు. కేసు నమోదైన వెంటనే పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీ కెమెరాల ఫుటేజీ, సాంకేతిక ఆధారాలు, బ్యాంకు లావాదేవీలు విశ్లేషించారు. శనివారం నిందితుడిని అరెస్టు చేసి ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
వృద్ధురాలిని పరామర్శించిన డిప్యూటీ మేయర్
దోపిడి దొంగ దాడిలో గాయపడి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జంగం రాజమ్మను డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావు పరామర్శించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి డాక్టర్లకు సూచించారు. బాధితురాలికి తక్షణ ఆర్థిక సహాయం అందజేశారు. 27వ డివిజన్ కార్పొరేటర్ బొట్ల శ్యామల–కిరణ్ పాల్గొన్నారు.


