గోదావరిఖని: బంధువు చనిపోతే దశదినకర్మ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి గుడిలో నిద్రకు వెళ్లాడు. రాత్రి నిద్రలోనే అనంత లోకాలకు చేరుకోవడం విషాదం నింపింది. వివరాలు.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కృష్ణానగర్ చెందిన దాసరి సదానందం(45) ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం సమీప బంధువు మృతి చెందింది. దశదినకర్మ అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి గుడిలో నిద్రించేందుకు ఈనెల 7న రాత్రి గోదావరిఖనిలోని కోదండరామాలయం వెళ్లాడు. రాత్రి నిద్ర తర్వాత శనివారం తెల్లవారుజామున గుడి నుంచి ఇంటికి వెళ్లేందుకు సదానందం నిద్రలేపేందుకు యత్నించారు. ఎంతపిలిచినా చలనం లేకుండా పోయింది. దీంతో కుమారుడికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని 108అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి భార్య దాసరి శారద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై మనోహర్ తెలిపారు.
మంథనిరూరల్: బంధువు చనిపోతే దశదిన కర్మ అనంతరం గుడిలో నిద్ర చేసేందుకు వెళ్లి శాశ్వత నిద్రలోకి వెళ్లిన ఘటనతో స్వగ్రామం మంథని మండలం పోతారంలో విషాదం నెలకొంది. పోతారం గ్రామానికి చెందిన దాసరి నదానందం గోదావరిఖనిలోని కృష్ణానగర్‌లో నివసిస్తున్నాడు. ఓ ప్రైవేట్ పాఠశాల వాహనానికి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడు మృతి చెందిన విషయం తెలుసుకున్న బంధువులు, కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటి పోయాయి. బంధువు చనిపోతే గుడికి నిద్రకు పోయి శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయాడంటూ కన్నీటి పర్వంతమయ్యారు. స్వగ్రామమైన పోతారంలో శనివారం అంత్యక్రియలు నిర్వహించారు.


