కోనరావుపేట(వేములవాడ): తండ్రీకొడుకుల మధ్య వాగ్వాదం ముదిరి.. గొడ్డలితో దాడికి దారితీసింది. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేటకు చెందిన గుడిపేట రాఘవులు, రాజేందర్(36) తండ్రీకొడుకులు. గల్ఫ్‌కు వెళ్లిన రాజేందర్ ఏడాది క్రితం ఇంటికొచ్చాడు. ఇద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. కొన్ని నెలల క్రితం రాజేందర్ దాడి చేయడంతో తండ్రి రాఘవులు చేయి విరిగింది. ఇటీవల కొడుకును హత్య చేసేందుకు తండ్రి బండరాయితో ప్రయత్నించగా రాజేందర్‌కు గాయాలయ్యాయి. శనివారం కూడా ఎప్పటిలాగే ఇద్దరి మధ్య ఇంట్లోనే వాగ్వాదం చోటుచేసుకుంది. మద్యం సేవించిన రాఘవులు ఇంట్లోనే మంచంపై పడుకుని ఉన్న రాజేందర్‌పై గొడ్డలితో దాడి చేశాడు. ఈ సంఘటనలో రాజేందర్ మెడపై, చెవిబాగంలో గాయాలయ్యాయి. వెంటనే గమనించిన గ్రామస్తులు సిరిసిల్లలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. రాజేందర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కోనరావుపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆస్పత్రికి తరలింపు.. పరిస్థితి విషమం


