పంచాయతీలకు ‘కరెంట్‌’ షాక్‌ | - | Sakshi
Sakshi News home page

పంచాయతీలకు ‘కరెంట్‌’ షాక్‌

Aug 9 2026 1:52 AM | Updated on Aug 9 2026 1:52 AM

● రూ.11.26 కోట్ల విద్యుత్‌ బకాయిలు ● నాలుగేళ్లుగా నిధుల్లేక పాలకుల అవస్థలు ● 15 శాతం చెల్లించాలంటూ విద్యుత్‌శాఖ ఒత్తిడి

కరీంనగర్‌టౌన్‌: మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు తయారైంది జిల్లాలోని గ్రామ పంచాయతీల పరిస్థితి. ఇప్పటికే నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న పంచాయతీలపై విద్యుత్‌ బకాయిలు భారంగా మారాయి. జిల్లాలోని 318 గ్రామపంచాయతీల్లో రూ.11,26,69,783 విద్యుత్‌ బకాయిలు పేరుకుపోయాయి. వచ్చిన అరకొర నిధులను గ్రామాభివృద్ధికి వెచ్చించాలా.. విద్యుత్‌ బిల్లులు చెల్లించాలా అన్న అయోమయంలో పాలకులు ఉన్నారు.

నాలుగేళ్లుగా నిధుల కటకట

నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంచాయతీల కు నిధులు సక్రమంగా విడుదల కాకపోవడంతో నిర్వహణ భారంగా మారింది. కేంద్ర ఆర్థిక సంఘం నిధులు పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధిదీపాలు, క్లోరినేషన్‌, కార్మికుల వేతనాలు, ట్రాక్టర్ల ఈఎంఐల ఖర్చులకే సరిపోవడం లేదని పంచాయతీ పాలకులు చెబుతున్నారు.

15 శాతం చెల్లించాల్సిందే

విద్యుత్‌ బకాయిల్లో కనీసం 15 శాతం చెల్లించాలని ట్రాన్స్‌కో అధికారులు పంచాయతీలపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చేతిలో చిల్లిగవ్వ లేక ఇబ్బందులు పడుతున్న పంచాయతీలకు కొత్త కష్టం వచ్చిపడింది. కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధుల్లో కొంత మొత్తాన్ని విద్యుత్‌ బకాయిలకు మళ్లించాల్సి రావడంతో అత్యవసర పనులకు నిధుల కొరత మరింత తీవ్రం కానుంది.

చిన్న పంచాయతీలదే అసలు కష్టం

జిల్లాలోని 318 గ్రామాల్లో మేజర్‌ పంచాయతీలు మినహా చిన్న పంచాయతీల పరిస్థితి దయనీయంగా ఉంది. జనాభా ప్రాతిపదికన చిన్న పంచాయతీలకు నెలకు సుమారు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు, మేజర్‌ పంచాయతీలకు రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు కేంద్ర ఆర్థిక సంఘం నిధులు వస్తున్నాయి. ఈ నిధులతోనే పలు రకాల నిర్వహణ, అభివృద్ధి పనులు చేపట్టాల్సి వస్తోంది.

నీటి సరఫరాతో అదనపు భారం

మిషన్‌ భగీరథ నీరు పూర్తిస్థాయిలో అందడం లేదు. దీంతో పంచాయతీ పరిధిలోని బావుల్లో విద్యుత్‌ మోటార్‌ అమర్చి నల్లానీరు సరఫరా చేయాల్సి వస్తోంది. ఫలితంగా ఒక్కో పంచాయతీకి రూ.వేలల్లో అదనంగా విద్యుత్‌ బిల్లు వస్తోంది. కొన్నేళ్లుగా జీపీలకు నిధులు రాకపోవడంతో విద్యుత్‌ భారం తలనొప్పిగా మారింది.

బిల్లులు కట్టాలా.. గ్రామాలు నడపాలా?

వీధిదీపాలు వెలిగించేందుకు, తాగునీటి సరఫరాకు కరెంట్‌ అవసరం.. పారిశుధ్య పనులకు సిబ్బందికి జీతాలు ఇవ్వాలి. మరోవైపు పేరుకుపోయిన విద్యుత్‌ బకాయిలు చెల్లించాల్సి వస్తోంది. దీంతో పంచాయతీలకు వచ్చిన కొద్దిపాటి నిధులు కరెంట్‌ బిల్లులకే మళ్లించే పరిస్థితి నెలకొనడంతో గ్రామాల్లో అభివృద్ధి మందగించే ప్రమాదం ఉందని పాలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement